కేరళ అక్రమ అవయవ వ్యాపార కింగ్‌పిన్‌ హైదరాబాద్ లో అరెస్ట్

కేరళ అక్రమ అవయవ వ్యాపార కింగ్‌పిన్‌ హైదరాబాద్ లో అరెస్ట్
అక్రమ అవయవ వ్యాపారం, దాని సంబంధిత మానవ అక్రమ రవాణా కేసులో హైదరాబాద్‌కు చెందిన రాకెట్‌ కింగ్‌పిన్‌ను ఎర్నాకులం రూరల్‌ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) హైదరాబాద్‌లో అరెస్టు చేసింది. ఈ కేసులోని నిందితుడు బల్లంకొండ రామ్‌ ప్రసాద్‌ (41) అలియాస్‌ ప్రసాద్‌ విజయవాడకు చెందిన వ్యక్తి. ఇతన్ని హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో కేరళ సిట్‌ బృందం పట్టుకుంది. అతన్ని కేరళలోని కొచ్చికి తీసుకొచ్చి అక్కడ అరెస్టు చేశారు.
 
కాగా, ఎర్నాకులం జిల్లా పోలీస్‌ చీఫ్‌ వైభవ్‌ సక్సేనా ఈ కేసు గురించి మాట్లాడుతూ ‘నిందితుడు హైదరాబాద్‌కు చెందిన రాకెట్‌కు మాత్రమే కాదు.. ఇతర రాకెట్‌లలో కూడా సంబంధం కలిగి ఉన్నాడు. ఎందుకంటే అతను గ్రహీతలకు సరిగ్గా సరిపోయేలా దాతలను కనుగొనడంలో సామర్థ్యం కలవాడు’ అని చెప్పారు. 
 
ఆయన కధనం మేరకు ఈ రాకెట్‌లో పరిశీలించాల్సిన విషయం ఏమిటంటే 60 శాతం దాతల్ని ఆసుపత్రులు కూడా తిరస్కరించలేదు. అవయవాల మ్యాచ్‌ని నిర్థారించడానికి ప్రారంభంలో హైదరాబాద్‌లోని లేబరేటీస్‌నే ఉపయోగించారు. సాధారణంగా గ్రహీతలకు తగ్గవిధంగా దాతలు దొరకడం చాలా కష్టం.  ఈ కేసులో పాలక్కాడ్‌కు చెందిన దాత షమీర్‌ను గత నెలలో ఇరాన్‌కు పంపేందుకు ఏర్పాట్లు చేశారు. 
 
అయితే షమీర్‌ మలయాళీ అని చెప్పుకున్నప్పటికీ అతను తమిళనాడులోని పొల్లాచ్చికి చెందినవాడు. ప్రసాద్‌ మాత్రమే కాదు.. మధు అనే వ్యక్తికి కూడా ఈ కేసులో సంబంధం ఉంది. మధు ప్రస్తుతం ఇరాన్‌లో ఉన్నాడు. ఆర్గాన్‌ డోనార్స్‌ మధుతో నేరుగా టచ్‌లో ఉన్నారు. వీరికి కావాల్సిన అవసరాలను ప్రసాద్‌ చూసుకునేవారని సక్సేనా వివరించారు.
 
తాను అవయవాలతో వ్యాపారం చేయడం కరోనా కాలం నుంచి ప్రారంభమైందని ప్రసాద్‌ పోలీసులకు చెప్పాడు. కానీ అంతకుముందు నుంచే ఈ రాకెట్‌ నడుపుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కరోనా సమయంలో కిడ్నీ దాతనుంచి ఈ రాకెట్‌ ప్రారంభమైంది. దాతను చూసినప్పటికీ ఆ సమయంలో అతనికి ఆరోగ్యం సహకరించలేదు. కానీ గ్రహీతల కోసం అతను పనిచూస్తూనే ఉన్నాడని పోలీసులు తెలిపారు. 
 
దాతల్ని అతను సోషల్‌మీడియా ద్వారానే తెలుసుకునేవాడు. ప్రత్యేకించి ఈ పని కోసం అతను టెక్నాలజీ తెలిసిన కొంతమంది ఉదోయగులను కూడా నియమించుకున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో మే 21వ తేదీన త్రిసూర్‌కు చెందిన సబిత్‌ నాసర్‌ను ఇరాన్‌ నుండి రాగానే కొచ్చి విమానాశ్రయంలో ఎమిగ్రేషన్‌ అధికారులు అదుపులోకి తీసుకుని పోలీసులు అప్పగించారు. 
 
నెడుంబస్సేరి పోలీసులు సబిత్‌ను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఉన్న నలుగురు నిందితుల్లో మధును మినహాయించి ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. మధుని ఇరాన్‌ నుంచి రప్పించేందుకు చట్టపరమైన చర్యలను ప్రారంభించినట్లు సక్సేనా చెప్పారు. ప్రసాద్‌పై మానవ అక్రమ రవాణా, అవయవాల మార్పిడి చట్టం కింద సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ప్రసాద్‌ను కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించనున్నారు. ఆ తర్వాత పోలీసులు అతన్ని కస్టడీని కోరనున్నారు.