
అమెరికా గడ్డపై తొలిసారి జరగనున్న టి20 ప్రపంచకప్ మ్యాచ్‌ల కోసం అటు ఐసిసి, ఇటు పోలీసులు కట్టుదిట్టమైన నిఘాల మధ్య భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ముఖ్యంగా జూన్ 9వ తేదీన భారత్, పాకిస్తాన్ మధ్య ఇక్కడి ‘నాసా కౌంటీ క్రికెట్ స్టేడియం’లో జరిగే మ్యాచ్ భద్రతకు సంబంధించి అధికారులు అదనపు దృష్టి పెట్టారు.
ఈ మ్యాచ్‌కు తీవ్రవాద ముప్పు ఉన్నట్లు సమాచారం ఉండటంతో అన్ని వైపుల నుంచి పోలీసులు అప్రమత్తమై జాగ్రత్త చర్యలు చేపట్టారు. గతంలో ఎన్నడూ చూడని భద్రతా ఏర్పాట్లు ఇక్కడ కనిపించబోతున్నాయి అని ఒక పోలీస్ ఉన్నతాధికారి చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో పెద్ద సంఖ్యలో జనాలను లక్ష్యంగా చేస్తూ ఏక వ్యక్తి చేసే ‘వుల్ఫ్ అటాక్’ తరహా దాడులకు ఆస్కారం ఉందని భావిస్తుండటంతో వాటిని నివారించేందుకు అడుగడుగునా పోలీసులను మోహరిస్తున్నారు.
మ్యాచ్ జరిగే రోజు ఐసన్ హౌవర్ పార్క్ పరిసరాలన్నీ పోలీసుల ఆధీనంలో ఉంటాయి. తాము ఏ విషయంలో కూడా ఉదాసీనత ప్రదర్శించబోమని నాసా కౌంటీ ఎగ్జిక్యూటివ్ బ్రూస్ బ్లేక్‌మన్, పోలీస్ కమిషనర్ ప్యాట్రిక్ రైడర్ వెల్లడించారు. ప్రతీ రోజూ నాసా కౌంటీ సహా ఇతర నగరాలకు కూడా బెదిరింపు కాల్స్ వస్తుంటాయని, తాము ఏ ఒక్కదాన్ని తేలిగ్గా తీసుకోబోమని తెలిపారు.
అన్నింటినీ సీరియస్‌గా పరిశీలిస్తామని, భారత్, పాక్ మ్యాచ్ జరిగే రోజు అదనంగా పెద్ద సంఖ్యలో పోలీసు సిబ్బందిని ప్రత్యేకంగా నియమించామని తెలిపారు. ఆ రోజు స్టేడియంలో కనీవినీ ఎరుగని భద్రతతో అభిమానులంతా సురక్షితంగా ఉంటారని హామీ ఇస్తున్నానని రైడర్ చెప్పారు. మరోవైపు ఐసీసీ కూడా ప్రేక్షకుల భద్రతే తమకు ముఖ్యమని, ఈ విషయంలో స్థానిక పోలీసులతో కలిసి పని చేస్తున్నామని పేర్కొంది.
తొలి రోజు ఫిట్నెస్ ట్రెయినింగ్ పైనే దృష్టి పెట్టిన భారత క్రికెట్ జట్టు రెండో రోజు పూర్తి స్థాయి నెట్ ప్రాక్టీస్‌కు హాజరైంది. ఆటగాళ్లంతా దాదాపు మూడు గంటలపాటు సాధన చేశారు. నాసా కౌంటీ గ్రౌండ్‌కు దాదాపు ఐదు మైళ్ల దూరంలో ఉన్న కాంటియాగ్ పార్క్‌లో ఈ ప్రాక్టీస్ సాగింది. ఇక్కడ ఆరు డ్రాప్ ఇన్ పిచ్‌లు ఉండగా భారత్ మూడు పిచ్‌లను వినియోగించుకుంది. రెండు పిచ్‌లపై బ్యాటర్లు సాధన చేయగా, మరో పిచ్‌ను బౌలింగ్ కోసమే టీమిండియా కేటాయించింది.
రోహిత్, గిల్, సూర్యకుమార్, పాండ్యా, దూబే, పంత్, జడేజా బ్యాటింగ్‌లో శ్రమించారు. కోహ్లి ఇంకా జట్టుతో చేరకపోగా… ఆలస్యంగా అమెరికాకు వచ్చిన యశస్వి జైస్వాల్, సంజూ సామ్సన్, రింకూ సింగ్, యుజువేంద్ర చహల్ మాత్రం సాధనకు దూరంగా ఉన్నారు.
More Stories
హెచ్-1బి కొత్త ధరఖాస్తులకే లక్ష డాలర్ల రుసుము
ఇరాన్‌పై మరోసారి తీవ్రమైన ఆర్థిక ఆంక్షలు
ఆపరేషన్ సింధూర్ తో స్థావరాలు మారుస్తున్న జైషే, హిజ్బుల్