45 గంటల సుదీర్ఘ ధ్యానంలో మోదీ

45 గంటల సుదీర్ఘ ధ్యానంలో మోదీ
సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగియడంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తమిళనాడులోని కన్యాకుమారిలోని వివేకానంద రాక్‌ మెమోరియల్‌ వద్ద సుదీర్ఘ ధ్యానం చేస్తున్నారు. గురువారం సాయంత్రం 6:45 గంటల నుంచి ధ్యానం చేయడం మొదలు పెట్టారు. సుమారు 45 గంట‌ల పాటు మోదీ ధ్యానం చేయ‌నున్నారు. 
 
అక్కడ రామకృష్ణ పరమహంస, మాతా శారదాదేవి చిత్రపటాలకు పూలమాలలు వేశారు. అనంతరం వివేకానందుడి విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించి ధ్యాన ప్రక్రియను ప్రారంభించారు. ఈ సమయంలో ఆయన మౌనంగా ఉంటారు. ప్రధాని మోదీ కాషాయ దుస్తులు ధరించి ధ్యానం చేస్తున్న దృశ్యాలను భారతీయ జనతా పార్టీ ఎక్స్‌ ద్వారా ప్రజలతో షేర్​ చేసుకుంది.
 

ధ్యాన ప్రక్రియలో భాగంగా శుక్రవారం సూర్యోదయాన సూర్యుడికి నీటితో అర్ఘ్యం సమర్పించారు. అనంతరం సూర్యనమస్కారం చేశారు. వివేకానంద స్మారక ప్రాంగణంలో ప్రధాని మోదీ కలియతిరిగారు. చేతిలో జపమాల పట్టుకుని జపం చేసుకుంటూ అడుగులు వేశారు.  ఆ తర్వాత మళ్లీ ధ్యాన మండపంలో కూర్చుని ధ్యానంలో నిమగ్నమయ్యారు. 

 
కాషాయ చొక్కా, శాలువా, ధోతీ ధరించి ధాన్యం చేస్తున్నప్రధాని మోదీ చిత్రాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.  కాషాయ దుస్తులు ధరించి ప్రశాంత వాతావరణంలో మోదీ ధ్యానం చేస్తున్న వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి. మోదీ పర్యటన నేపథ్యంలో అక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
 
ధాన్యం సమయంలో ప్రధాని మోదీ కేవలం ద్రవాహారం మాత్రమే తీసుకుంటారు. గురువారం రాత్రి నుంచి ప్రారంభించిన ధ్యానం జూన్‌ ఒకటో తేదీ సాయంత్రం ముగుస్తుంది. అప్పటివరకు కొబ్బరి నీళ్లు, ద్రాక్షరసం మాత్రమే తీసుకుంటారు.