
అత్యధిక సంఖ్యలో శత కోటీశ్వరులను లోక్‌సభ ఎన్నికల బరిలోకి దింపిన ఘనత తెలుగు రాష్ట్రాలకు దక్కింది. వివిధ రాష్ట్రాల నుండి పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలను పరిశీలించి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ (ఎడిఆర్) సంస్థ ఈ మేరకు ఒక నివేదికను ప్రకటించింది.
వ్యక్తిగతంగా అభ్యర్థుల సగటు ఆస్తులు, పార్టీల వారీగా అభ్యర్థుల సగటు ఆస్తులు రాష్ట్రాల వారీగా అభ్యర్థుల సగటు ఆస్తులు ఇలా మూడు విభాగాల్లోనూ తెలుగు రాష్ట్రాలకు చెందిన పార్టీలే అగ్రస్థానంలో నిలిచాయి. ఆస్తుల లెక్కలకు సంబంధించి రూపొందిచిన ఈ నివేదికలో వైఎస్‌ఆర్‌సిపి ఎనిమిదవ స్థానంలో ఉండగా, సిపిఎం చివరి స్థానంలో ఉంది.
అత్యధికంగా ధనిక అభ్యర్థులను నిలిపిన పార్టీల్లో తెలుగుదేశం పార్టీ మొదటి స్థానంలో నిలిచింది. ఆ పార్టీ అభ్యర్థుల సగటు ఆస్తులు 416 కోట్ల రూపాయలుగా ఎడిఆర్ తేల్చింది. 82 కోట్ల రూపాయల సగటుతో జనసేన మూడవ స్థానంలోనూ, 54 కోట్ల రూపాయల సగటుతో బిఆర్‌ఎస్ నాల్గవ స్థానంలో నిలిచింది. రెండవ స్థానంలో 94 కోట్ల రూపాయలతో జనతాదళ్ (ఎస్) ఉంది.
గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎన్నికల బరిలోకి దిగిన పెమ్మసాని చంద్రశేఖర్ 5,706 కోట్ల రూపాయలతో దేశంలోనే అత్యంత ధనిక అభ్యర్థిగా రికార్డుల కెక్కారు. తెలంగాణలోని చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం నుండి బిజెపి తరపున ఎన్నికల బరిలోకి దిగిన కొండా విశ్వేశ్వరరెడ్డి దేశంలోనే రెండవ ధనిక అభ్యర్థి!
ఈ నియోజకవర్గం నుండే కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న గడ్డం రంజిత్ రెడ్డి 436 కోట్ల రూపాయల ఆస్తులతో ధనిక అభ్యర్థుల జాబితాకెక్కారు. ఆంధ్రప్రదేశ్‌లో సగటున ఒక్కో అభ్యర్థికి 21 కోట్ల రూపాయల ఆస్తులు, తెలంగాణలో సగటున 14 కోట్ల రూపాయల ఆస్తులున్నట్లు ఎడిఆర్ పేర్కొంది. అదే, కేరళలో అభ్యర్థుల సగటు ఆస్తుల విలువ 2.3 కోట్ల రూపాయలుగా ఉంది.
More Stories
దేశంలోనే అత్యంత సంపన్న మహిళగా రోష్ని నాడార్
డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో నటుడు విశాల్ బ్రహ్మ అరెస్ట్
తక్కువ స్థాయిలో ద్రవ్యోల్బణం .. ఎస్బీఐ అంచనా