‘టగ్ ఆఫ్ వార్’లో చైనాపై భారత సైనికుల విజయం

‘టగ్ ఆఫ్ వార్’లో చైనాపై భారత సైనికుల విజయం
ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక మిషన్ లో భాగంగా ఆఫ్రికాలోని సూడాన్ లో మోహరించిన చైనా దళాలతో భారత దళాలు ‘టగ్ ఆఫ్ వార్’ ఆడాయి. ఈ సరదా గేమ్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టగ్ ఆఫ్ వార్ అనేది ఒక పోటీ. దీనిలో రెండు జట్లు ఒక తాడు యొక్క వ్యతిరేక చివరలను తమవైపు బలంగా లాగుతుంటాయి. 
 
ప్రత్యర్థి జట్టును, సెంట్రల్ లైన్ దాటి తమవైపు లాగిన టీమ్ విజయం సాధించినట్లు ప్రకటిస్తారు. ఇటీవల సూడాన్ లో భారత్ , చైనా సైనికుల మధ్య ఈ టగ్ ఆఫ్ వార్ జరిగింది. ఆ వైరల్ వీడియోలో, భారత దళాలు టగ్ ఆఫ్ వార్ ఆటలో విజయం కోసం గరిష్టంగా ప్రయత్నం చేయడం, చైనా దళాలు కూడా తమ అత్యుత్తమ ప్రదర్శనను ఇవ్వడం కనిపిస్తుంది. 
 
చివరకు భారత దళాలు విజయం సాధించడం, అనంతరం ఆనందోత్సాహాలతో భారతీయ దళాలు సంబరాలు చేసుకోవడం ఆ వీడియోలో స్పష్టంగా కనిపించాయి. భారత మద్దతుదారులు ” ఇండియా, ఇండియా…” అని నినదించారు. చైనా మద్దతుదారులు తమ జట్టు కోసం హర్షధ్వానాలు చేశారు. 
ఈ వైరల్ వీడియో ప్రామాణికతను ఆర్మీ అధికారులు ధృవీకరించారు. ఇది రెండు దేశాల సైనికుల మధ్య జరిగిన స్నేహపూర్వక గేమ్ అని వివరించారు. జనవరి 9, 2005 న సూడాన్ ప్రభుత్వం, సూడాన్ పీపుల్స్ లిబరేషన్ మూవ్ మెంట్ ల మధ్య సమగ్ర శాంతి ఒప్పందం కుదిరింది. 
 
ఆ తరువాత 2005 మార్చి 24న ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం ద్వారా ‘సూడాన్ లో యునైటెడ్ నేషన్స్ మిషన్’ రూపుదిద్దుకుంది. సమగ్ర శాంతి ఒప్పందం అమలుకు మద్దతు ఇవ్వడం, మానవతా సహాయం, రక్షణ, మానవ హక్కుల ప్రోత్సాహానికి సంబంధించిన నిర్దిష్ట విధులను నిర్వహించడం, సుడాన్ లోని ఆఫ్రికన్ యూనియన్ మిషన్ కు మద్దతు అందించడం యుఎన్ ఎంఐఎస్ బాధ్యతలు. ఇందులో భాగంగానే భారత్, చైనా దళాలు సూడాన్ లో ఉన్నాయి.