ఆరోగ్య బీమాలోకి ఎల్ఐసీ!

ఆరోగ్య బీమాలోకి ఎల్ఐసీ!

ఇటీవలి కాలంలో వైద్య ఖర్చులు భారీగా పెరిగాయి. కరోనా తర్వాత ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. వైద్య చికిత్స ఖర్చులు పెరిగిపోవడంతో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు ప్రభుత్వం అధికారికంగా హెల్త్ ఇన్సూరెన్స్ అమలు చేస్తోంది. కార్పొరేట్, ప్రైవేట్ సంస్థల్లోనూ తమ సిబ్బందికి గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. 

కానీ, ఇప్పటి వరకూ హెల్త్ ఇన్సూరెన్స్ రంగంలో ప్రైవేట్ బీమా సంస్థలదే రాజ్యం. దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ జీవిత బీమా సౌకర్యం అందుబాటులోకి తేవడంలో కీలకంగా వ్యవహరించిన భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) తాజాగా ఆరోగ్య బీమా రంగంలోకి ప్రవేశించేందుకు కసరత్తు చేస్తోంది. అందుకోసం ఇప్పటికే హెల్త్ ఇన్సూరెన్స్ సేవలు అందిస్తున్న బీమా సంస్థలను టేకోవర్ చేసుకునే అవకాశాలనూ ఎల్ఐసీ నిశితంగా పరిశీలిస్తోంది. 

హెల్త్ ఇన్సూరెన్స్ రంగంలోకి కాంపోజింట్ ఇన్సూరెన్స్ సంస్థలను అనుమతించేందుకు కేంద్రం లైసెన్సులు మంజూరు చేయనున్నది. అందుకు అనుగుణంగా తమ సంస్థలో అంతర్గతంగా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించినట్లు ఎల్ఐసీ తెలిపింది.

‘మాకు సాధారణ బీమా రంగంలో అనుభవం ఎక్కువ. హెల్త్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్‌లో మాకు ఆసక్తి ఉంది. అసాధారణ వృద్ధి సాధించడానికి మాకు గల అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని మేం భావిస్తున్నాం’ అని ఎల్ఐసీ చైర్మన్ సిద్ధార్థ మొహంతి చెప్పారు. కాంపోజిట్ ఇన్సూరెన్స్ లైసెన్సులు మంజూరు చేసే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంటరీ కమిటీ సిఫారసు చేసింది. 

దీనివల్ల ఆయా బీమా సంస్థలకు ఖర్చులు తగ్గడంతోపాటు నియంత్రణా పరమైన ఇబ్బందులు తగ్గుతాయని పేర్కొంది. అయితే, ప్రస్తుత చట్టం ప్రకారం సాధారణ బీమా రంగ సంస్థలకు ఆరోగ్య బీమా రంగంలోకి ప్రవేశించడానికి అనుమతి లేదు. ఎల్ఐసీ వంటి బీమా సంస్థలకు అనుమతి ఇవ్వాలంటే బీమా రంగ చట్టానికి సవరణలు చేయాల్సి ఉంటుంది.