మే 31న సిట్‌ ముందు హాజరవుతా .. ప్రజ్వల్‌ రేవణ్ణ

మే 31న సిట్‌ ముందు హాజరవుతా .. ప్రజ్వల్‌ రేవణ్ణ
లైంగిక దౌర్జన్యాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హసన్‌ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ ఎట్టకేలకు స్పందించారు. ఈ నెల 31వ తేదీన విచారణకు హాజరవుతానని స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రముఖ వార్తా సంస్థ ఇండియా టుడేకు తెలిపినట్లు జాతీయ మీడియా వెల్లడించింది.

ఏప్రిల్ 26న జరిగిన కర్ణాటక లోక్‌సభ ఎన్నికల తొలి దశకు ముందు ప్రజ్వల్‌పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అతను దౌత్య పాస్‌పోర్ట్‌తో విదేశాలకు పారిపోయాడు. ఇక అప్పటి నుంచి భారత్‌కు తిరిగిరాలేదు. దీంతో అతనిపై పోలీసులు అరెస్ట్‌ వారెంట్‌ కూడా జారీ చేశారు. 

ఇక పోలీసుల ఎదుట లొంగిపోవాలంటూ ప్రజ్వల్‌కు కుటుంబ సభ్యులు ఎన్ని హెచ్చరికలు చేసినా స్పందించలేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా అతను దర్యాప్తు సంస్థ సిట్‌ ముందు విచారణకు హాజరవుతానంటూ ప్రకటించారు. తనపై వచ్చిన ఆరోపణలతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయినట్లు చెప్పారు.

‘నన్ను తప్పుపట్టొద్దు. నాపై తప్పుడు కేసులు పెట్టారు. మే 31వ తేదీ ఉదయం 10 గంటలకు సిట్‌ ఎదుట హాజరవుతాను. విచారణకు సహకరిస్తాను. న్యాయస్థానంపై నాకు నమ్మకం ఉంది’ అని తెలిపినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. నివేదికల ప్రకారం.. రాజకీయ కుట్రలో భాగంగానే తనపై తప్పుడు కేసులు పెట్టినట్లు ప్రజ్వల్‌ తెలిపారు. ఇప్పటి వరకూ తాను ఎక్కడున్నానో చెప్పనందుకుగానూ కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలకు క్షమాపణలు చెప్పారు.

‘రాహుల్ గాంధీతో పాటు చాలా మంది కాంగ్రెస్ నేతలు దీనిపై నాకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.. ఇదంతా రాజకీయ కుట్రలో బాగమే.. మే 31న ఉదయం 10.00 గంటలకు సిట్ ముందు హాజరై కేసుకు సంబంధించిన సమాచారం అందజేస్తాను.. విచారణకు సహకరిస్తాను.. న్యాయవ్యవస్థపై నాకు నమ్మకం ఉంది.. అంతేకాదు, నా విదేశీ ప్రయాణానికి ముందుగానే ఏర్పాట్లు చేసుకున్నాను.. అప్పటికి నాపై ఎలాంటి కేసు లేదు.. నేను విదేశీ పర్యటనలో ఉండగానే ఆరోపణలు బయటపడ్డాయి’ అని రేవణ్ణ వివరించారు.

‘విదేశాల్లో నేను ఎక్కడ ఉన్నానో సరైన సమాచారం అందించనందుకు నా కుటుంబ సభ్యులకు, మా కుమారన్న (హెచ్‌డి కుమారస్వామి), పార్టీ కార్యకర్తలకు క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. ఏప్రిల్ 26వ తేదీన ఎన్నికలు ముగిసినప్పుడు నాపై ఎలాంటి కేసూ లేదు. నేను విదేశాలకు వెళ్లిన రెండు రోజుల తర్వాత నాపై వచ్చిన ఆరోపణలను యూట్యూబ్‌లో చూశాను. అప్పుడు ఏడు రోజుల సమయం కావాలంటూ సిట్‌కు లేఖ రాశాను’ అని ప్రజ్వల్‌ ఇండియా టుడేకి తెలిపారు.

తన విదేశీ పర్యటనలకు, కేసులకు సంబంధమే లేదని స్పష్టం చేస్తూ తన పర్యటన ముందుగానే నిర్ణయించుకున్నదని తెలిపారు. సిట్ తనకు నోటీసు జారీ చేసిందని తెలిశాక తన అడ్వొకేట్ ద్వారా స్పందించినట్లు గుర్తు చేశారు. తనపై కాంగ్రెస్ నాయకులు దాడి మొదలెట్టాక తాను డిప్రెషన్ లోకి వెళ్లిపోయినట్లు తెలిపారు.  రాజకీయ కుట్రలో భాగంగానే తనపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. ఈ మేరకు సిట్‌ ముందు హాజరై విచారణకు సహకరిస్తానని తెలిపారు.