
చైనా, రష్యాల మధ్య బంధం బలోపేతం ఈ రెండు దేశాల, ప్రజల మౌలిక ప్రయోజనాలే కాదు, ఈ ప్రాంతానికి, అలాగే యావత్ ప్రపంచ శాంతి, సుస్థిరత, సౌభాగ్యాలకూ ఎంతో ప్రయోజనకరమని చైనా, రష్యా అధినేతలు ఉద్ఘాటించారు. రష్యా అధ్యక్షుడిగా అయిదో సారి తిరిగి ఎన్నికైన పుతిన్ తన మొదటి అధికారిక పర్యటనకు చైనాను ఎంచుకోవడాన్ని బట్టి ద్వైపాక్షిక సహకార రంగంలో బంధం బలోపేతానికి ఇరు దేశాల నేతలు ఇస్తున్న ప్రాధాన్యతను తెలియజేస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్ రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం ఉదయం బీజింగ్‌కు చేరుకున్నారు. తన పర్యటన ఇరు దేశాల సంబంధాల్లో ఒక గొప్ప మైలు రాయిగా నిలిచిపోతుందని పుతిన్ వ్యాఖ్యానించారు. ఇరువురు నేతలు బీజింగ్‌లో సమావేశమై రక్షణ, వాణిజ్య రంగాల్లో సహకారాన్ని మరింత పెపొందించుకోవాలని నిశ్చయించారు.
రష్యాతో మంచి భాగస్వామిగా, మంచి మిత్రునిగా, మంచి ఇరుగుపొరుగు దేశంగా ఉంటూ కలసి మెలసి పనిచేయడానికి చైనా సిద్ధంగా ఉండని జిన్‌పింగ్ తెలిపారు. స్వేచ్ఛ, న్యాయంతో కూడిన ప్రపంచ వ్యవస్థ కోసం ఇరు దేశాలు శక్తివంచన లేకుండా కృషి చేస్తాయని పుతిన్‌తో చర్చల అనంతరం జిన్‌పింగ్ తెలిపారు.
ఈ సంవత్సరం చైనా-రష్యా దౌత్య సంబంధాల 75వ వార్షికోత్సవాలను జరుపుకుంటున్నందున, ద్వైపాక్షిక సంబంధాలను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లడమే ఈ ఉత్సవాల ప్రధానోద్దేశంగా ఉంటుందని జిన్‌పింగ్ తెలిపారు. ఎన్ని ఒడిదుడుకులు వున్నా ఒక శతాబ్దంలో మూడువంతుల పాటు చైనా-రష్యా సంబంధాలు అభివృద్ధి చెందుతూ వచ్చాయని పేర్కొన్నారు.
పుతిన్ తాను 40సార్లకు పైగా కలుసుకున్నామని, ఇద్దరి మధ్య మంచి కమ్యూనికేషన్ వుందని చెప్పారు. చైనా-రష్యా సంబంధాలు ఎంతగానో కష్టపడి సాధించుకున్నవని, వాటిని అభివృద్దిపరుచుకుంటూ ముందుకు సాగడం ఇరు పక్షాలకు కూడా అవసరమని స్పష్టం చేశారు.
పుతిన్ మాట్లాడుతూ, ఇరు దేశాల మధ్య సంబంధాలు అవకాశవాదంతో కొనసాగుతున్నవి కావు, పైగా ఏ ఒక్కరికి వ్యతిరేకంగానో ఉద్దేశించినవి కూడా కావన్నది ప్రాధమికంగా కీలకమైన అంశమని చెప్పారు. ఈనాడు ప్రపంచ వ్యవహారాల్లో తమ సహకారమనేది అంతర్జాతీయ రంగంలో ప్రధానమైన కీలకాంశాల్లో ఒకటిగా పనిచేస్తుందని పేర్కొన్నారు.
ఉక్రెయిన్‌పై చర్చలకు తాము సిద్ధంగా వున్నామని చెప్పారు. అయితే అటువంటి చర్చలు ఈ ఘర్షణలో ప్రమేయమున్న అన్ని దేశాల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు. ఐక్యరాజ్య సమితి, బ్రిక్స్, ఎస్సిఓ, జి-20 వేదికలపై ఇరు దేశాలు విజయవంతంగా సహకరించుకుంటున్నాయని తెలిపారు.
అంతకుముందు, చారిత్రక గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్ వద్దకు పుతిన్ చేరుకోగానే, సాదర స్వాగతం లభించింది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్ఎ) గౌరవ వందనం స్వీకరించారు. దాదాపు 15నిముషాల పాటు సాగిన ఈ కార్యక్రమం అనంతరం ఇరువురు నేతలు చర్చలు జరిపారు. ప్రధానంగా వాణిజ్యం, ఆర్థిక సహకారంపైనే దృష్టి కేంద్రీకరిస్తారని భావిస్తున్నారు.
More Stories
పాక్-సౌదీ రక్షణ ఒప్పందంలో మరిన్ని ముస్లిం దేశాలు
హెచ్-1బీ వీసా దరఖాస్తులకు లక్ష డాలర్ల రుసుము
యాసిన్ మాలిక్ ను `శాంతిదూత’గా అభివర్ణించిన మన్మోహన్!