
ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. వారణాసి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి మోదీ తన నామినేషన్ పత్రాలను అందజేశారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తదితరులు మోదీ వెంట రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వచ్చారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, ఎన్డీఏ నేతలు హాజరయ్యారు. వారణాసి నుంచి మూడోసారి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కంటే ముందు మోదీ గంగా నది తీరంలో ఉన్న దశాశ్వమేథ ఘాట్‌లో ప్రత్యేక పూజలు చేశారు. వేద మంత్రోచ్ఛరణల మధ్య ఆయన గంగా హారతి నిర్వహించారు. ప్రధాని మోదీతో పూజారి రామణ్ పూజలు చేయించారు. దేశ సంక్షేమం కోసం గంగా పూజ చేపట్టినట్లు ఆయన వెల్లడించారు.
మూడవ సారి మోదీ ప్రధాని కావాలని, దేశ ప్రఖ్యాతలు ప్రపంచవ్యాప్తంగా వెలిగిపోవాలని కోరుకున్నట్లు పూజారి రామణ్ వెల్లడించారు.అన్ని దశల ఎన్నికల్లో ప్రధాని మోదీకి ఘన విజయం లభించాలని ఆశీర్వదించినట్లు మరో పూజారి సంతోష్ నారయన్ తెలిపారు. దశాశ్వమేథ ఘాట్‌లో పూజలు నిర్వహించిన తర్వాత.. ప్రధాని మోదీ ప్రత్యేక క్రూయిజ్ బోట్‌లో విహరించారు. సోమవారం రాత్రి ప్రధాని మోదీ .. కాశీ విశ్వేశ్వరుడి దర్శనం చేసుకున్నారు.
నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఎన్డీయే భాగస్వామ్య నేతలతో కలెక్టరేట్ కార్యాలయం వెలుపల బలప్రదర్శన చేశారు. ఎన్డీయే కూటమి నేతలు తమ సంఘీభావాన్ని చాటుతూ మోదీ నాయకత్వంలో పనిచేయడం పట్ల హర్షం ప్రకటించారు. ఎన్డీయే కూటమి నేతల బలప్రదర్శనలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా 25 మంది ఎన్డీయే నేతలు పాల్గొన్నారు.
మోదీ నామినేషన్ కార్యక్రమానికి బీజేపీ ముఖ్యమంత్రులతో పాటు మిత్రపక్షాల సీఎంలు హాజరయ్యారు. బిహార్ సీఎం నితీశ్ కుమార్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మ, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, అసోం సీఎం హిమంత్ బిశ్వ శర్మ, హరియాణా సీఎం నయాబ్ సింగ్ సైనీలతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌లతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌లు వారణాసికి చేరుకున్నారు.
గత 10 సంవత్సరాలలో వారణాసి ప్రజల తమ పట్ల చూపుతున్న “ప్రేమ, ఆశీర్వాదాలకు” ధన్యవాదాలు తెలిపిన ప్రధాన మంత్రి, నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి కొత్త శక్తితో నిరంతరం కృషి చేస్తానని తెలిపానరు. “వరుసగా మూడవసారి వారణాసి నుండి నా నామినేషన్ దాఖలు చేయడానికి నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. గత 10 సంవత్సరాలలో మీ అందరి నుండి నాకు లభించిన అద్భుతమైన ప్రేమ, ఆశీర్వాదాలు నిరంతర సేవా స్ఫూర్తితో, పూర్తి సంకల్పంతో పనిచేయడానికి నన్ను ప్రేరేపించాయి. మీ అందరి మద్దతు, భాగస్వామ్యం, నేను నా మూడవ సారి కూడా ఇక్కడి సర్వతోముఖాభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి కొత్త శక్తి మరియు శక్తితో పని చేస్తాను, ”అని ఆయన ప్రకటించారు.
ఎన్‌డిఎ మిత్రపక్షాల నేతలు తనకు మద్దతుగా హాజరు కావడంపై ఆయన స్పందిస్తూ, ఈ బంధం “జాతీయ ప్రగతికి” నిబద్ధతను సూచిస్తుందని పేర్కొన్నారు. “ఈరోజు కాశీలో మన విలువైన ఎన్డీయే మిత్రపక్షాల నేతలు పాల్గొనడం నేను గౌరవంగా భావిస్తున్నాను. మన కూటమి జాతీయ పురోగతికి, ప్రాంతీయ ఆకాంక్షలను నెరవేర్చడానికి నిబద్ధతకు ప్రాతినిధ్యం వహిస్తుంది. రాబోయే సంవత్సరాల్లో భారతదేశ పురోగతి కోసం మనం కలిసి పని చేస్తాము” అనే అభిలాషను వ్యక్తం చేస్తూ ఆయన X లో పోస్ట్ చేసారు.
More Stories
హిందుస్తానీ సంగీతకారుడు పండిట్ చన్నులాల్ మిశ్రా మృతి
గాంధీజీ శాంతి, సహనం, సత్యం సందేశం మానవాళికి ప్రేరణ
మాలవీయ మిషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం