
లోక్‌సభ ఎన్నికల నాలుగో దశలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా 10 రాష్ర్టాలు/యూటీల్లోని 96 లోక్‌సభ నియోజకవర్గాలకు సోమవారం పోలింగ్ జరుగనున్నది. వీటితోపాటుగా ఏపీలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతగా, అదేవిధంగా ఒడిశాలో అసెంబ్లీకి తొలి దశలో భాగంగా 28 స్థానాల్లో పోలింగ్ జరుగుతుంది. ఈ దశలో అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష ఇండియా కూటమియేతర పార్టీలపైనే పరిశీలకుల దృష్టి ప్రధానంగా ఉంది.
నాలుగో దశలో ఎన్నికలు జరగనున్న 96 నియోజక వర్గాలలో దాదాపు సగం ఉభయ తెలుగు, రాష్ర్టాలు, ఒడిషాలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఒడిషాలో బిజూ జనతాదళ్ (బీజేడీ), తెలంగాణలో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఫలితాలను నిర్ణయించనున్నాయి. తెలంగాణలోని మొత్తం 17, ఏపీలోని 25 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. యూపీలో 13, బీహార్-5, జార్ఖండ్ 4, మధ్యప్రదేశ్-8, మహారాష్ట్ర-11, ఒడిశా-4, పశ్చిమబెంగాల్-8, జమ్ముకశ్మీర్‌లో ఒక్క స్థానం చొప్పున సోమవారం పోలింగ్ జరుగున్నది.
96 లోక్‌సభ స్థానాల్లో మొత్తం 1,717 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు. 1.92 లక్షల పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. దాదాపు 17.70 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 8.73 కోట్ల మంది మహిళలు ఉన్నారు. ఈ లోక్‌సభ ఎన్నికల విడతలో పలువురు ప్రముఖులు బరిలో ఉన్నారు.
సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) అధినేత అఖిలేశ్ యాదవ్ యూపీలోని కన్నౌజ్ నుంచి పోటీచేస్తున్నారు. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, టీఎంసీ ఫైర్ బ్రాండ్ మహు వా మొయిత్రా, కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి, మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్, నిత్యానంద్ రాయ్, పంకజ ముండే, తదితర నేతలు భవితవ్యం ఈ దశ ఎన్నికల్లో తేలనున్నది. ఏఐఎంఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తమ కుటుంబానికి కంచుకోటగా భావిస్తున్న హైదరాబాద్ లో రాజకీయాలలోకి కొత్తగా ప్రవేశించిన బిజెపి అభ్యర్థి కె మాధవీలత నుండి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు.
లఖింపూర్ హింసాకాండలో నిందితుడైన అశిష్ మిశ్రా తండ్రి, కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా తిరిగి అదే స్థానం నుంచి పోటీచేస్తున్నారు. కాగా, 543 సీట్లు ఉండే లోక్‌సభలో ఇప్పటి వరకు జరిగిన మూడు దశల ఎన్నికల్లో 283 స్థానాల్లో(52 శాతం) పోలింగ్ పూర్తయింది. మొత్తంగా, ప్రస్తుతం ఎన్డీఏకు ఉన్న 49స్థానాల్లో 42 బీజేపీవి కాగా మిగతా 7 దాని మిత్రపక్షాలవి. ఈ స్థానాలలో అత్యధికం యూపీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో ఉన్నాయి. 2019లో ఇండియా కూటమి ఈ స్థానాలలో 12 మాత్రమే గెలుచుకోగలిగింది.
కాంగ్రెస్, దాని మిత్రపక్షాలకు సమస్థాయిలో ఆ స్థానాలు దక్కాయి. ఇక మిగిలిన 35 స్థానాలలో 32 ను ఇతర’ పార్టీలు స్వాయత్తం చేసుకున్నాయి. వాటిలో 32 ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నాయి. 2019 అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఈ బలాబలాలను పెద్దగా మార్చలేదు. లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు మరోసారి ఏకకాలంలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ 2019లో అటు లోక్ సభ, ఇటు అసెంబ్లీ స్థానాల్లో ఐదింట నాలుగో వంతు సీట్లను సాధించుకుంది.
అయితే ప్రస్తుత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీలతో కూడిన కూటమి నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటోంది. రాష్ట్ర పాలక పక్షం ప్రధానంగా తన సంక్షేమ పథకాలపై ఆధారపడుతోంది. ప్రతిపక్ష ఎన్డీఏ కూటమి ప్రజల్లో తీవ్రంగా ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతపై ఆశలు పెట్టుకుంది. రాజధాని వివాదం, కుల సమీకరణాలు, ముఖ్యంగా జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ సొంత సామాజిక వర్గం కాపుల మద్దతు తమకు విశేష లబ్ధి సమకూర్చగలవని ఎన్డీఏ విశ్వసిస్తోంది. పాలక వైసీపీకి గ్రామీణ ప్రాంతాల్లోను, దక్షిణ రాయలసీమలోను ప్రజాదరణ ఉండగా, టీడీపీ జనసేన- బీజేపీ కూటమికి పట్టణ ప్రాంతాలలోను, ఉత్తరాంధ్రలోను జనబలం బాగా ఉంది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో లభించిన విజయాలను మరింతగా పటిష్ఠం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. చాలా నియోజక వర్గాలలో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్య ఉంది. గత అసెంబ్లీ ఎన్నికలలో గ్రామీణ ప్రాంతాలలో మంచి ఫలితాలు సాధించిన కాంగ్రెస్ గ్రేటర్ హైదరాబాద్ లో చతికిల బడింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుని, వారిని లోక్‌సభకు పోటీ చేయిస్తోంది.
More Stories
హెచ్-1బీ వీసా దరఖాస్తులకు లక్ష డాలర్ల రుసుము
యాసిన్ మాలిక్ ను `శాంతిదూత’గా అభివర్ణించిన మన్మోహన్!
పోలవరం నిర్వాసితులకు పునరావాస హామీలు నెరవేర్చాలి