బీజేపీని గెలిపించుకోవాలని కృత నిశ్చయంతో తెలంగాణ ప్రజలు

బీజేపీని గెలిపించుకోవాలని కృత నిశ్చయంతో తెలంగాణ ప్రజలు

తెలంగాణకు ఉజ్వల భవిష్యత్‌ ఇచ్చేందుకు బీజేపీ కట్టుబడి ఉందనిపేర్కొంటూ రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం వద్దని ప్రజలు బీజేపీని గెలిపించుకోవాలని  కృత నిశ్చయంతో ఉన్నారని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్బీ స్టేడియంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ మధ్య తరగతి ప్రజల గురించి కాంగ్రెస్‌ ఏమాత్రం పట్టించుకోదని మండిపడ్డారు.

“తెలంగాణకు ఉజ్వల భవిష్యత్‌ ఇచ్చేందుకు బీజేపీ కట్టుబడి ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం వద్దని ప్రజలు నిశ్చయించుకున్నారు. బీజేపీని గెలిపించుకోవాలని ప్రజలు కృత నిశ్చయంతో ఉన్నారు. జూన్‌ 4 తర్వాత భారత విరోధులు పారిపోక తప్పదు” అని తెలిపారు.

జూన్‌ 4 తర్వాత భారత విరోధులు, ఉమ్మడి పౌరస్మృతి విరోధులు, ఆర్టికల్‌ 370 రద్దు వ్యతిరేకులు, ఓట్‌ జిహాద్‌ వాళ్లు పారిపోక తప్పదని ప్రధాని హెచ్చరించారు. మధ్య తరగతి ప్రజల కలను బీజేపీ సర్కార్‌ నెరవేరుస్తోందని, గత పదేళ్లలో ఎన్నో సమస్యలకు ఎన్డీఏ సర్కార్‌ పరిష్కారం చూపిందని తెలిపారు.

నేడు భారత్‌ డిజిటల్‌ రంగం, అంకుర సంస్థల్లో సూపర్ పవర్‌గా నిలిచిందని మోదీ పేర్కొన్నారు. వారసత్వ రాజకీయాలు చేయడం కాంగ్రెస్‌ ట్రాక్‌ రికార్డుగా ఉందని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో నగరంలో ఎన్నోచోట్ల బాంబు పేలుళ్లు జరిగాయని, దిల్‌సుఖ్‌నగర్‌ సాయిబాబా గుడి వద్ద బాంబు పేలుడు జరిగిందని గుర్తు చేశారు. 

కాంగ్రెస్‌ పాలనలో ఎక్కడికెళ్లాలన్నా భయపడాల్సిన పరిస్థితి ఉండేదని, గత పదేళ్ల కాలంలో అలాంటి పరిస్థితిని చూశారా? అని ప్రశ్నించారు. దేశాన్ని విభజించి పాలించాలని కాంగ్రెస్‌ కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్‌ రాకుమారుడి గురువు మనల్ని ఆఫ్రికన్లు అని మాట్లాడారని, శ్రీ రామనవమి జరుపుకోవడం కూడా తప్పే అన్నట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 

అహింసో పరమో ధర్మో అనేది ఇండియా సిద్ధాంతమని, వసుధైక కుటుంబం, బుద్ధం శరణం, గచ్చామి, ప్రజా సేవే భగవాన్‌ సేవ, వేల సంవత్సరాల సంస్కృతి రక్షణే ఇండియా అసలైన సిద్ధాంతమని మోదీ పునరుద్ఘాటించారు. గత ప్రభుత్వం హైదరాబాద్‌ ముక్తి దివస్‌ను నిర్వహించలేదని, బీజేపీ ప్రభుత్వం సెప్టెంబర్‌ 17ను అధికారికంగా నిర్వహించిందని మోదీ గుర్తు చేశారు. 

మతపరమైన రిజర్వేషన్లు ఉండకూడదనేది బీజేపీ సిద్ధాంతమని, ముస్లింల రిజర్వేషన్లు తీసేస్తామని మాత్రమే బీజేపీ చెప్పిందని ప్రధాని స్పష్టం చేశారు. తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులను ఏటీఎంగా మార్చుకున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కొత్తగా ఆర్‌ఆర్ఆర్ ట్యాక్స్‌ కూడా మొదలైందని, మూడో ఆర్‌ అంటే రజాకార్‌ ట్యాక్స్‌ మోదీ పేర్కొన్నారు.

తెలంగాణకు ఏమీ ఇవ్వలేదని కాంగ్రెస్ అంటోందని, తెలంగాణకు 4 వందే భారత్‌ రైళ్లు ఇచ్చింది ఎవరని మోదీ ప్రశ్నించారు. తెలంగాణకు తొలి ఎయిమ్స్, ఫర్టిలైజర్స్ పరిశ్రమ, పసుపు బోర్డు, గిరిజన విశ్వవిద్యాలయం మంజూరు చేసినట్లు తెలిపారు. సబ్‌ కా సాత్‌, సబ్‌ కా వికాస్‌ బీజేపీ నినాదమని స్పష్టం చేశారు. బీజేపీ అభ్యర్థులైన మధవీ లత, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి, బూర నర్సయ్య గౌడ్‌లను గెలిపించాలని ప్రజలకు మోదీ  విజ్ఞప్తి చేశారు.