పట్టభద్రుల ఎంఎల్‌సికి నోటిఫికేషన్

పట్టభద్రుల ఎంఎల్‌సికి నోటిఫికేషన్
నల్గొండ – ఖమ్మం -వరంగల్ పట్టభద్రుల ఎంఎల్‌సి ఉప ఎన్నికకు నో టిఫికేషన్ విడుదలైంది. గురువారం నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. మొత్తం 12 జిల్లాలతో కూడిన ఈ నియోజకవర్గంలో పోటీ చేయాలనుకునే అభ్యర్థులంతా నల్గొండ కలెక్టరేట్‌లోనే తమ నామినేషన్లను సమర్పించాల్సి ఉంది. నల్గొండ కలెక్టర్ హరిచందన ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. 

నామినేషన్‌ను దాఖలు చేసే అభ్యర్థులు సెలవు దినాలు మినహా, మిగతా అన్ని ప్రభుత్వ పని దినాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నా మినేషన్లు దాఖలు చేయవచ్చు. ఈ నెల 9 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 10న నామినేషన్ల పరిశీలన, 13న నామినేషన్ల ఉప సంహరణకు అవకాశం ఉంది. 

ఈ నెల 27న పోలింగ్, జూన్ 5న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ నియోజకవర్గం పరిధిలో 4,61,806 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదయ్యారు.2027 వరకు పదవీ కాలం : 2021 మార్చిలో పల్లా రాజేశ్వర్ రెడ్డి ఈ స్థానానికి ఎంఎల్‌సిగా ఎన్నికయ్యారు. 2027 మార్చి వరకు ఆయన పదవీ కాలం ఉండగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన జనగామ శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. 

దాంతో డిసెంబర్ 9న తన ఎంఎల్‌సి పదవికి రాజీనామా చేశారు. పల్లా రాజీనామా చేయడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యం కాగా, మే 27న పోలింగ్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుండగా, జూన్ 5న ఓట్లు లెక్కించి, అదే రోజు ఫలితాలు ప్రకటించనున్నారు.

గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి,  రెండో స్థానంలో నిలిచిన తీన్మార్ మల్లన్నను ఈ పర్యాయం కాంగ్రెస్ తమ అభ్యర్థిగా ప్రకటించింది. బిఆర్ఎస్, బీజేపీకి ఇంకా తమ అభ్యర్థులను ప్రకటించలేదు.