బ్రిజ్‌భూషణ్‌ టికెట్‌ను కొడుక్కి బిజెపి సీట్

బ్రిజ్‌భూషణ్‌ టికెట్‌ను కొడుక్కి బిజెపి సీట్
* రాయ్‌బరేలీ అభ్యర్థిగా యుపి మంత్రి దినేష్ సింగ్
 
ఉత్తర్‌ప్రదేశ్‌లో బీజేపీకి కీలక నేతగా ఉన్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు ఈ ఎన్నికల్లో ఆ పార్టీ మొండిచేయి చూపించింది. కైసర్‌గంజ్ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను పార్టీ తప్పించింది. ఆ నియోజకవర్గ టికెట్‌ను బ్రిజ్ భూషణ్ చిన్న కుమారుడు కరణ్ భూషణ్ సింగ్‌కు కేటాయించింది.
 
ఉత్తరప్రదేశ్‌లో కీలకమైన రాయ్‌బరేలీ లోక్‌సభ నియోజకవర్గం అభ్యర్థిని బీజేపీ ప్రకటించింది. 2004 నుంచి సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ స్థానంలో మంత్రి దినేష్‌ సింగ్‌ను మళ్లీ పోటీకి దించింది. 2019లో ఇక్కడ నుంచి పోటీ చేసిన ఆయన సోనియా గాంధీ చేతిలో ఓడిపోయారు. అయితే ఈసారి గాంధీ కుటుంబం నుంచి ఎవరు పోటీ చేసినా ఓడిపోక తప్పదని దినేష్‌ సింగ్‌ తెలిపారు. నకిలీ గాంధీలను రాయ్‌బరేలి ప్రజలు సాగనంపుతారన్న నమ్మకం తనకు ఉందని పేర్కొన్నారు.
 
ఆరు సార్లు ఎంపీగా ఎన్నికైన బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మహిళా రెజ్లర్లపై లైంగికంగా వేధింపులకు పాల్పడ్డారని గతేడాది మహిళా రెజ్లర్లతోపాటు పలువురు పురుష రెజ్లర్లు ఢిల్లీలో కొన్ని నెలల పాటు నిరసనలు చేశారు. ఈ క్రమంలోనే తాజాగా బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు బీజేపీ టికెట్ నిరాకరించింది.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని కైసర్‌గంజ్ నుంచి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ వరుసగా మూడు సార్లు లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే గతేడాది తీవ్ర లైంగిక ఆరోపణలు రావడం, ఈ క్రమంలోనే రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ పదవి నుంచి తప్పుకోవడం సహా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. రెజ్లర్లపై లైంగిక వేధింపుల వ్యవహారం బ్రిజ్ భూషణ్‌తోపాటు బీజేపీకి కూడా తీవ్ర విమర్శలను తెచ్చిపెట్టింది. 

 
ఈ క్రమంలోనే ప్రస్తుత ఎన్నికల్లో ఆయనకు టికెట్ నిరాకరించినట్లు తెలుస్తోంది. అయితే ఆ స్థానంలో బ్రిజ్ భూషణ్ కుమారుడిని బరిలోకి దించడం గమనార్హం. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కైసర్‌గంజ్ నియోజకవర్గం నుంచి బ్రిజ్ భూషణ్ 2 లక్షలకు పైగా ఓట్లతో విజయం సాధించారు.  బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ చిన్న కుమారుడు కరణ్ భూషణ్ సింగ్ ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్ రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. అంతేకాకుండా గోండాలోని నవాబ్‌గంజ్‌లో సహకార గ్రామాభివృద్ధి బ్యాంకు అధ్యక్షుడి పదవి కూడా కలిగి ఉన్నారు.