
ఆంధ్ర ప్రదేశ్ లో సమస్యాత్మక నియోజకవర్గాలుగా గుర్తించిన 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో భారీ సంఖ్యలో సీఆర్పీఎఫ్ బలగాలు మోహరించనున్నారు. పుంగనూరు, పలమనేరు, పీలేరు, రాయచోటి, తంబళ్లపల్లె, తిరుపతి, చంద్రగిరి, విజయవాడ సెంట్రల్, మాచర్ల, వినుకొండ, గురజాల, పెదకూరపాడు, ఒంగోలు, ఆళ్లగడ్డ నియోజకవర్గాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు.
ఏపీ వ్యాప్తంగా 4.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా తెలిపారు. ఎన్నికల నిర్వహణ కోసం మొత్తం 46 వేల 389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఒక్కో పోలింగ్ కేంద్రం ద్వారా 1500 మంది ఓటేయవచ్చన్న ముకేష్ కుమార్ మీనా ఓటర్ల సంఖ్య 1500 దాటితే ఆక్సిలరీ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ ఎన్నికల్లో 1.60 లక్షల బ్యాలెట్ యూనిట్లను వాడుతున్నట్లు చెప్పారు. ఏపీ ఎన్నికలకు సంబంధించి కేవలం 28,591 మంది మాత్రమే హోం ఓటింగ్ కోరుకున్నట్లు మీనా తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 7,28,484 మంది హోం ఓటర్లు ఉంటే అందులో కేవలం మూడు శాతం మాత్రమే ఈ విధానాన్ని ఎంచుకున్నట్లు చెప్పారు.
మే 2 నుంచి హోం ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైందని.,మే 8వ తేదీ వరకూ హోం ఓటింగ్ కొనసాగుతుందని మీనా వెల్లడించారు. వయోవృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్ద నుంచే ఓటు వేసేలా హోం ఓటింగ్ విధానాన్ని ఎన్నికల సంఘం తీసుకువచ్చింది. అయితే ఏపీలో దీనికి అంతగా స్పందన లభించలేదు.
మరోవైపు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద 864 కేసులు నమోదయ్యాయని, 72,416 మందిని బైండోవర్ చేసినట్లు ఏపీ సీఈవో తెలిపారు. అలాగే ఇప్పటివరకు ఏపీ వ్యాప్తంగా జరిపిన తనిఖీల్లో రూ. 203 కోట్లు పట్టుబడినట్లు వెల్లడించారు. మరోవైపు ఎండల తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో మెడికల్ కిట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతున్నట్లు మీనా తెలిపారు. 2019 ఎన్నికల సమయంలో ఏపీలో 3, 93, 45, 717 వేల మంది ఓటర్లు ఉండగా, ఈసారి ఓటర్లు 4 కోట్లకు దాటిపోయారు.
రాష్ట్రంలో 454 మంది ఎంపీ, 2300 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు పోటీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. మొత్తం అభ్యర్థుల వివరాలు డీజీపీ, ఏడీజీపీ, ఇంటెలిజెన్స్కు పంపించామని తెలిపారు. నివేదిక మేరకు ముప్పు ఉన్న 374 మంది ఎమ్మెల్యే, 64 మంది ఎంపీ అభ్యర్థులకు భద్రత కల్పిస్తామని మీనా వివరించారు. జనసేన పోటీచేసే ఎంపీ పరిధి అసెంబ్లీ స్థానాల్లో గ్లాసు గుర్తు ఇతరులకు ఇవ్వలేదని సీఈవో పేర్కొన్నారు. ఇప్పటికే కేటాయించిన 7 ఎంపీ, 8 అసెంబ్లీ స్థానాల్లో ఇతరులకు గుర్తు మార్చామని సీఈవో మీనా చెప్పారు.
More Stories
టీటీడీ పరకామణిలో ఫారిన్ కరెన్సీ దోపిడీపై సీఐడీ దర్యాప్తు
పోలవరం నిర్వాసితులకు పునరావాస హామీలు నెరవేర్చాలి
టిడిపిలో చేరిన ముగ్గురు వైసీపీ ఎమ్యెల్సీలు