
నిత్యం ఎక్కడో ఒకచోట ఎందరో అబలలు వరకట్న వేధింపులకు బలవుతూనే ఉన్నారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ స్థాయి నుంచే వరకట్నం నియంత్రణకు చర్యలు చేపట్టింది. ప్రభుత్వ సర్వీసుల్లో పని చేసే అధికారులు, ఉద్యోగులు ఇకపై వివాహాలు చేసుకునే సమయంలో వరకట్నం తీసుకోలేరు.
తమ వివాహ సమయంలో ఎలాంటి వరకట్నం తీసుకోలేదని నియామక అధికారికి అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది. వివాహం జరిగిన తేదీ, సమయ తదితర వివరాలను పేర్కొంటూ అఫిడవిట్ సమర్పించాల్సిందే. ఉపాధ్యాయ సంఘాలు అఫిడవిట్ ఇవ్వడాన్ని స్వాగతించాయి. తాము కట్నం తీసుకోబోమని విద్యార్థులతో పాటు ఇతరులను సైతం చైతన్యపరుస్తామని సంఘాలు పేర్కొంటున్నాయి.
ఉత్తరప్రదేశ్ వరకట్న నిషేధ నియమాలు-2004 కఠినంగా అమలు చేసేందుకు నిర్ణయించింది. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగుల నుంచి అఫిడవిట్ తీసుకోవాలని మహిళా సంక్షేమశాఖ డైరెక్టర్ సందీప్ కౌర్ అన్నిశాఖ అధిపతులకు సూచనలు చేశారు. ఇందు కోసం నిర్ణీత ఫార్మాట్‌లో అఫిడవిట్‌ను నింపాల్సి ఉంలుంది. అందులో పెళ్లి సమయంలో, ఆ తర్వాత కట్నం తీసుకోలేదని పేర్కొనాల్సి ఉంటుంది.ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల నేతలు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలను ప్రతి ఉపాధ్యాయుడు పాటిస్తారని, విద్యార్థులతో పాటు ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తారని హామీ ఇచ్చారు. ఎడ్యుకేషనల్ ఫెడరేషన్ జిల్లా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ జ్యోతిప్రకాశ్ మాట్లాడుతూ వరకట్నం సమాజానికి శాపంగా పరిణమించిందని, ఎంతో మంది అమాయక యువతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. బాలికలకు చదువు నేర్పించాలని ఉపాధ్యాయ నేతలు సూచిస్తున్నారు.
వాస్తవానికి 1999లో వరకట్న నిషేధ నియమాలను యూపీ ప్రభుత్వం రూపొందించింది. ఆ తర్వాత మార్చి 31, 2004న నియమాలను సవరిస్తూ నిర్ణయం తీసుకున్నది. ప్రత్యేకంగా ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తన నియామకం సమయంలో వివాహం జరిగిన సమయంలో ఎలాంటి కట్నం తీసుకోలేదని పేర్కొంటూ అపాయింట్‌మెంట్ అథారిటీకి అఫిడవిట్ అందించాలని రూల్-5లో స్పష్టం చేసింది. గతంలోనూ అఫిడవిట్ కోరిన సందర్భాలున్నాయి. తాజాగా ప్రభుత్వం మరోసారి ఉద్యోగుల నుంచి అఫిడవిట్ కోరింది.
More Stories
అస్సాం రైఫిల్స్ వాహనంపై కాల్పులు.. ఇద్దరు జవాన్లు మృతి
వాతావరణ మార్పుల ప్రభావం.. ఇక ఏటా కుండపోత వర్షాలే!
అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదంపై అమెరికాలో దావా