గోవాలో తొలిసారి బీజేపీ అభ్యర్థిగా ఓ మహిళ

గోవాలో తొలిసారి బీజేపీ అభ్యర్థిగా ఓ మహిళ

లోక్‌సభ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను బీజేపీ విడుతల వారీగా ప్రకటిస్తున్నది. తాజాగా మరో 111 మందితో జాబితాను విడుదల చేసింది. అందులో గోవా నుంచి ఓ మహిళకు ఎంపీ టికెట్‌ ఇచ్చింది. ప్రముఖ పారిశ్రామివేత్త, డెంపో ఇండస్ట్రీస్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ప‌ల్లవి డెంపోను సౌత్ గోవా నుంచి బ‌రిలోకి దింపింది. 

దీంతో రెండు లోక్ సభ సీట్లు గల గోవాలో బీజేపీ టికెట్‌పై లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేస్తున్న మొదటి మహిళగా 49 ఏండ్ల డెంపో నిలిచారు. ఆమెకు ఇప్పటి వరకు రాజకీయ నేపథ్యం లేదు.  ప్రస్తుతం సౌత్ గోవా ఎంపీగా కాంగ్రెస్ నేత ఫ్రాన్సిస్కో స‌ర్దిన్హా ఉన్నారు. 1962 నుంచి ఇప్పటి వ‌ర‌కు ఆ స్థానంలో 1999, 2014 ఎన్నికల్లో మాత్రమే బీజేపీ విజయం సాధించింది.

“నన్ను ఎంపిక చేసినందుకు నేను బిజెపికి చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ ఎంపికను వినమ్రంగా అంగీకరిస్తున్నాను. ఈ సీటు గెలవడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. (ప్రధాని) నరేంద్ర మోదీ నాయకత్వ దృక్పథాన్ని నేను ఎప్పుడూ విశ్వసిస్తున్నాను. నా అభిప్రాయం ప్రకారం, కుల మతం లేదా మతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ శక్తివంతం చేసే దృక్పథం, సమాజంలోని ప్రతి వర్గానికి సమాన అవకాశాలు ఉన్నాయి, ”అని డెంపో తన ఎంపికపై సంతోషం వ్యక్తం చేస్తూ పేర్కొన్నారు.

పల్లవి డెంపో పుణెలోని ఎంఐటీ నుంచి కెమిస్ట్రీలో గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేశారు. బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ ప‌ట్టా కూడా అందుకున్నారు. ఇండో-జర్మన్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ సొసైటీ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. ఇది జర్మనీ, గోవా మధ్య సాంస్కృతిక ప్రచారానికి దోహదం చేస్తుంది. 

వెండెల్ రోడ్రిక్స్ ప్రారంభించిన ఫ్యాషన్, టెక్స్‌టైల్ మ్యూజియం అయిన మోడా గోవా ఫౌండేషన్‌కు ఆమె ట్రస్టీగా వ్యవహరిస్తున్నారు. 2012 నుంచి 2016 వరకు గోవా యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న అకడమిక్ కౌన్సిల్ సభ్యురాలిగా పనిచేశారు. ఆమె భర్త శ్రీనివాస్ డెంపో.. ఆయన ప్రస్తుతం గోవా చాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ అండ్ ఇండ‌స్ట్రీస్‌కు (జిసిసిఐ) అధిప‌తిగా కొన‌సాగుతున్నారు.