
లోక్ సభ ఎన్నికల్లో ఒడిశా రాష్టంలో ఒంటరిగానే పోటీ చేస్తున్నట్లు భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. అధికార బిజూ జనతాదళ్ తో పొత్తు పెట్టుకుందంటూ వస్తున్న వార్తలపై కమలం పార్టీ స్పష్టత ఇచ్చింది. రాష్ట్రంలో ఒంటరిగానే పోటీ చేయబోతున్నట్లు ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మన్మోహన్ సమాల్ వెల్లడించారు.
“ప్రధాని మోదీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఒడిశాలోని సామాన్యులకు చేరట్లేదు. దానికి సీఎం నవీన్ పట్నాయక్ సర్కారే కారణం. అందుకే బీజేడీతో బీజేపీ పొత్తు పెట్టుకోబోదు. పదేళ్లుగా నవీన్ పట్నాయక్ కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ వస్తున్నారు. ఇందుకు ఆయనకు కృతజ్ఞతలు” అంటూ ఆయన ఎక్స్‌లో కీలక పోస్ట్ లో తెలిపారు .
కానీ ప్రస్తుతం మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు ఒడిశా ప్రజలకు చేరట్లేదని, నవీన్ సర్కార్ కారణంగా ప్రజలు అన్యాయానికి గురవుతున్నారని, ఒడిశాలో ప్రస్తుతం అనేక సమస్యలు తాండవిస్తున్నాయని విమర్శించారు.
” ప్రధాని మోదీ దార్శనిక నేతృత్వంలో రాష్ట్రంలోని 4.5 కోట్ల ప్రజల ఆకాంక్షలు, కోరికలు నెరవేర్చడానికి బీజేపీ ఒంటరిగా పోరాడుతుంది. అభివృద్ధి చెందిన భారత్, ఒడిశాను రూపొందించడానికి బీజేపీ రానున్న లోక్ సభ ఎన్నికల్లో 21 స్థానాల్లో, 147 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి.. అధికారం చేపడుతుంది. ఏ పార్టీతో మేం పొత్తు పెట్టుకోబోం” అని మన్మోహన్ ఆ పోస్ట్ లో స్పష్టం చేశారు.
కాగా, ఒడిశాలో పాత మిత్రులు ఒక్కటయ్యారని, 11 సంవత్సరాల తర్వాత అధికార బిజూ జనతాదళ్, బీజేపీ మళ్లీ లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీచేయబోతున్నాయంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని 21 స్థానాలకు గానూ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సారథ్యంలోని బీజేడీ 13 స్థానాల్లో, బీజేపీ 8 చోట్ల పోటీ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి.
బీజేపీ మాత్రం 9 ఎంపీ సీట్లు, 55 అసెంబ్లీ స్థానాలు కోరుతున్నట్లు ప్రచారం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీకి 8 మంది ఎంపీలు, 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో పొత్తుపై ఇరు పార్టీలు ఒక అవగాహనకు వచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో పొత్తుపై బీజేపీ తాజాగా స్పష్టత ఇచ్చింది. ఒంటరిగానే పోటీకి దిగనున్నట్లు స్పష్టం చేసింది.రాష్ట్రంలో బీజేడీ, బీజేపీలు మొదటిసారిగా 1998 ఎన్నికల్లో కలిసి పోటీ చేశారు. 11 ఏండ్లపాటు కొనసాగిన ఇరు పార్టీల స్నేహానికి బ్రేక్ పడింది. 2009 ఎన్నికల సందర్భంగా 63 అసెంబ్లీ స్థానాలకు బదులుగా 40 చోట్ల, తొమ్మిది ఎంపీ సీట్లకు బదులు ఆరు స్థానాలే ఇస్తామని కమలం పార్టీకి బీజేడీ ప్రతిపాదించింది. అందుకు ఒప్పుకోని బీజేపీ అధిష్ఠానం ఒటరిగా పోటీచేసింది. దీంతో ఎన్డీఏ నుంచి బీజేడీ వెలుపలికి వచ్చింది. అయినప్పటికీ కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వానికి ఆ పార్టీ మద్దతు తెలుపుతూ వస్తుంది.
సీనియర్ ఎంపీ బిజెడికి రాజీనామా!
ఇలా ఉండగా, లోక్‌సభ ఎన్నికల వేళ ఒడిశాలో అధికార బీజేడీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నేత, కటక్ ఎంపీ భర్తృహరి మహతాబ్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు పంపించారు. ముఖ్యమైన ఎన్నికలు జరుగుతున్న వేళ కీలక నేత పార్టీ వీడటంతో బీజేడీకి పెద్ద షాకే తగలింది.
ఐదోసారి అధికారం కోసం ఎన్నికల సమరంలోకి దిగుతున్న నవీన్ సర్కారుకు ఇది ఊహించని దెబ్బగానే చెప్పవచ్చు. ఇటీవల ఒడిశా నటుడు అరిందమ్ రాయ్ బీజేడీకి గుడ్‌బై చెప్పి బీజేపీ కండువా కప్పుకున్నారు. బీజేడీలో అరిందమ్ ముఖ్య నేతగా ఉన్నారు.
More Stories
బిహార్‌లో నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్, 14న కౌంటింగ్
సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్‌పై దాడి యత్నం
బీసీ రిజర్వేషన్లపై పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు