పరువు నష్టం కేసులో తప్పును అంగీకరించిన కేజ్రీవాల్‌

పరువు నష్టం కేసులో తప్పును అంగీకరించిన కేజ్రీవాల్‌
2018 పరువు నష్టం కేసులో ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కు ఊరట లభించింది. యూట్యూబర్‌ ధ్రువ్‌ రాథీ వీడియోను రీట్వీట్‌ చేసిన కేసులో కేజ్రీవాల్‌పై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని ట్రయల్‌ కోర్టును సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.

యూట్యూబర్‌ ధ్రువ్‌ రాథీ 2018 మే నెలలో రూపొందించినట్లు చెబుతున్న ఓ వీడియోను కేజ్రీవాల్‌ తిరిగి ట్వీట్‌ చేశారు. దీంతో ఆయనపై క్రిమినల్‌ కేసు దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్ ఒకరిని కించపరిచేలా ఉన్న వీడియోను ఇతరులకు పంపడం కూడా పరువునష్టం చట్టం కింద నేరమే అవుతుందని, అలాంటి విషయాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేసింది.

ట్రయల్ కోర్టు సమన్లను కొట్టివేయడానికి నిరాకరించింది. దీనిపై కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేజ్రీవాల్‌ పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా పరువుకు భంగం కలిగించేలా ఉన్న ఆ వీడియోను రీట్వీట్ చేయడం పొరపాటు అని, కేసును మూసివేయాలని కేజ్రీవాల్‌ కోరారు. ఈ మేరకు కేజ్రీవాల్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ న్యాయస్థానానికి తెలిపారు.

 కేజ్రీవాల్ తన తప్పును అంగీకరించినందున ఈ కేసులో ఫిర్యాదుదారుని సూచనను సుప్రీంకోర్టు కోరింది. ఫిర్యాదుదారు తరఫు న్యాయవాది రాఘవ్ అవస్తీ కూడా దీనికి అంగీకరించారు. దీంతో ఈ కేసులో కేజ్రీవాల్‌పై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని ట్రయల్‌ కోర్టును సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను మార్చి 11కి వాయిదా వేసింది.