
టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌కు చెక్ బౌన్స్ కేసులో ఏడాది జెలు శిక్ష విధిస్తూ ఒంగోలు కోర్టు తీర్పునిచ్చింది. శిక్షతోపాటు రూ.95 లక్షల జరిమానా విధించింది. జరిమానాతో పాటు కోర్టు ఖర్చులు కూడా చెల్లించాలంటూ తీర్పు వెల్లడించింది. అయితే ఈ తీర్పుపై అప్పీల్ చేసుకునేందుకు బండ్ల గణేష్‌కు కోర్టు నెల రోజుల గడువు ఇచ్చింది.
2019లో ముప్పాళ్ల గ్రామానికి చెందిన జెట్టి వెంకటేశ్వర్లు వద్ద బండ్ల గణేష్ రూ.95 లక్షలు తీసుకున్నారు. అనంతరం పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పేరుతో జెట్టి వెంకటేశ్వర్లకు బండ్ల గణేష్ చెక్ ఇచ్చారు. ఈ చెక్ బౌన్స్ కావడంతో వెంకటేశ్వర్లు కోర్టును ఆశ్రయించారు. వెంకటేశ్వర్లు ఫిర్యాదుపై విచారణ చేపట్టిన కోర్టు ఇరువైపులా వాదనలు విన్నది.
ఈ కేసుకు విచారణకు హాజరవ్వాలని కోర్టు బండ్ల గణేష్‌కు పలుసార్లు నోటీసులు జారీ చేసింది. అయితే ఆయన ఒక్కసారి కూడా కోర్టుకు హాజరు కాలేదు. దీంతో కోర్టు బండ్ల గణేష్ మీద గతంలో అరెస్టు వారెంటు కూడా జారీచేసింది. ఈ క్రమంలో ఒంగోలు వన్‌టౌన్ పోలీసులు బండ్ల గణేష్ ను అరెస్టు చేసేందుకు హైదరాబాద్ కూడా వెళ్లారు.
ఇదే తరహాలో హైదరాబాద్ ఎర్రమంజిల్ కోర్టు గతంలో బండ్ల గణేష్ కు 6 నెలల జైలు శిక్ష విధించింది. టెంపర్ సినిమాకు సంబంధించి చెక్ బౌన్స్ కేసులో ఈ ఘటన చోటుచేసుకుంది. 2017లో టెంపర్ సినిమా వ్యవహారంలో దర్శకుడు వక్కంతం వంశీకి రూ.25 లక్షల చెక్ ఇచ్చారు బండ్ల గణేష్. అది బౌన్స్ కావడంతో వంశీ కోర్టును ఆశ్రయించారు.
దీంతో బండ్ల గణేష్‌కు ఎర్రమంజిల్ కోర్టు 6 నెలల జైలు శిక్ష, రూ.15.86 లక్షల జరిమానా విధించింది. అయితే వెంటనే బెయిల్ అప్లై చేసుకోగా, కోర్టు బండ్ల గణేష్ కు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. చిన్న పాత్రలతో సినిమా రంగంలోకి అడుగుపెట్టిన బండ్ల గణేష్ ఆ తర్వాత బడా నిర్మాతగా మారారు. పవన్ కల్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి టాప్ హీరోలతో వరసగా సినిమాలు చేశారు.
More Stories
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన
నేపాల్‌లో చిక్కుకున్న తెలుగు వారికోసం ప్రభుత్వాలు అప్రమత్తం
ఏపీలో నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు