
కేరళలోని మావెలిక్కర అదనపు జిల్లా సెషన్స్ కోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. బిజెపి నేత రంజీత్ శ్రీనివాస్ హత్యా కేసులో 15 మంది దోషులకు మరణశిక్షను విధించింది. ఇటీవల కాలం కేరళ చరిత్రలో ఒకేసారి ఇంత మంది నిందితులకు ఏ కోర్టు కూడా మరణశిక్షను ఖరారు చేయలేదు.
బీజేపీ నేత, లాయర్ రంజీత్ శ్రీనివాస్‌ను 2021, డిసెంబర్ 19న దారుణంగా హత్య చేశారు.
ఆ హత్య కేసు నిందితుల్లో నైసమ్, అజ్మల్, అనూప్, అస్లమ్, అబ్దుల్ కలామ్, సలామ్, సఫారుద్దిన్, మన్సద్, జసీబ్ రాజా, నవాస్, సమీర్, నాజిర్, జాకిర్ హుస్సేన్, షాజీ పూవతుంగల్, షేర్నాస్ అష్రఫ్ ఉన్నారు. ఈ నిందితులు అందరూ నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ), దాని రాజకీయ విభాగమైన సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియాకు చెందిన వారుగా తేలింది.
దోషులుగా తేలిన 15 మంది నిందితులను కోర్టు జనవరి 20న దోషులుగా నిర్ధారించింది. అనంతరం, జనవరి 30న వారికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పును మావెలిక్కర అదనపు జిల్లా జడ్జి వీజీ శ్రీదేవి తీర్పు వెలువరించారు. తల్లి, పిల్లలు, భార్య కళ్లెదుటే బాధితుడిని దారుణంగా, కిరాతకంగా హతమార్చిన తీరు అత్యంత అరుదైన నేరాల పరిధిలోకి తీసుకువస్తుందని పేర్కొంటూ దోషులకు గరిష్ట శిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ కోరింది.
ఆయన శరీరంపై 56కు పైగా గాయాలు ఉన్నాయని తెలిపింది. బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న శ్రీనివాసన్ హత్య కేసులో నిందితులందరూ దోషులుగా తేలినట్లు ప్రాసిక్యూషన్ తెలిపింది. నేరం సమయంలో రంజిత్ తల్లి, సోదరిపై శారీరకంగా దాడి చేయడం, గృహోపకరణాలను ధ్వంసం చేయడం వంటి ఇతర నేరాలు కూడా రుజువయ్యాయని తెలిపింది.
2021 డిసెంబర్ 19న ఉదయం అలప్పుజ పట్టణంలోని వెల్లకినార్ లో ఉన్న తన ఇంట్లో 40 ఏళ్ల రంజిత్ శ్రీనివాసన్ ను 12 మంది సభ్యుల ముఠా పదునైన ఆయుధాలతో నరికి చంపింది. రంజిత్ శ్రీనివాసన్ తల్లి, భార్య, చిన్న కుమార్తె కళ్ల ముందే ఈ దారుణానికి ఒడిగట్టారు. నిందితులకు అలపుజా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మెంటల్ స్టెబులిటీ పరీక్షలు నిర్వమించాలని కోర్టు ఆదేశించింది.
ఈ హత్య కేసులో తొలి 8 నిందితులపై ఐపీసీలోని 302, 149, 449, 506, 341 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వీరికి జీవిత కాల శిక్షతో పాటు మరణదండన విధించారు. తొలి 8 మంది ప్రత్యక్షంగా హత్యలో పాలు పంచుకున్నారు. హత్యకు గురైన బీజేపీ నేత ఇంటి ముందు ఆయుధాలతో నిఘా పెట్టిన 9 నుంచి 12వ నిందితుడి వరకు వివిధ సెక్షన్ల కింద కేసులను బుక్ చేశారు. ప్రధాన నిందితుల జాబితాలో జకీర్, షాజీ, షెర్నాస్పై ఐపీసీలోని 120బీ, 302 కింద కేసు బుక్ చేశారు.
అలప్పుళ డీవైఎస్పీ ఎన్ఆర్ జయరాజ్ కేసు దర్యాప్తును పూర్తి చేసి చార్జిషీట్‌ను సమర్పించారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ 156 మంది సాక్షులను విచారించింది. సుమారు వెయ్యి డాక్యుమెంట్లు, దాదాపు వంద ఆధారాలు బయటపడ్డాయి. గూగుల్ మ్యాప్స్ సహాయంతో తయారు చేసిన వేలిముద్రలు, సీసీటీవీ ఫుటేజీ, రూట్ మ్యాప్‌లతో సహా అనేక ఆధారాలు కేసు దర్యాప్తునకు కీలకంగా మారాయి.
More Stories
పాక్-సౌదీ రక్షణ ఒప్పందంలో మరిన్ని ముస్లిం దేశాలు
హెచ్-1బీ వీసా దరఖాస్తులకు లక్ష డాలర్ల రుసుము
యాసిన్ మాలిక్ ను `శాంతిదూత’గా అభివర్ణించిన మన్మోహన్!