కరొనతో డిసెంబర్‌లో 10 వేల మంది మృతి

కరొనతో డిసెంబర్‌లో 10 వేల మంది మృతి
ప్రపంచానికి కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని, ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు సిద్ధంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ టెడ్రోస్‌ అథనామ్‌ ఘెబ్రెయెస్ హెచ్చరించారు. ప్రపంచ దేశాల్లో పాక్షికంగా కరోనా పెద్ద ముప్పుగా మారిందని చెప్పారు.  ఒక్క డిసెంబరు నెలలోనే కరోనా మహమ్మారి వల్ల 10 వేల మందికి పైగా మరణించారని తెలిపారు.
క్రిస్మస్ సెలవుల కాలంలో కరోనా జేఎన్.1 వేరియంట్ అధికంగా వ్యాప్తి చెందిందని వెల్లడించారు. దీని ప్రభావం అమెరికా, యూరప్‌ దేశాల్లో అధికంగా ఉందని తెలిపారు.  ఈ వైరస్ వల్ల గతేడాది నవంబర్‌ నెలలో దవాఖానల్లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేరిన వారి సంఖ్య 42 నుంచి 62 శాతానికి పెరిగిందని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు.
కరోనా వైరస్ పట్ల అన్ని దేశాలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. కరోనా పరీక్షలు, చికిత్సలు, వ్యాక్సిన్లకు ప్రాధాన్యమివ్వాలని ప్రభుత్వాలను కోరారు.  వైరస్‌పై నిఘా వేసి సీక్వెన్సింగ్ నిర్వహించాలని చెప్పారు. మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు టీకాలు వేయించుకోవాలని, పరీక్షలు చేయించుకోవడంతోపాటు ముందు జాగ్రత్తగా మాస్కులు ధరించాలని ఆయన స్పష్టం చేశారు. 
 
2019లో కరోనా వైరస్‌ను చైనాలోని వుహాన్‌లో గుర్తించిన విషయం తెలిందే. రెండేండ్లు ప్రపంచాన్ని వణికించిన మహమ్మారి క్రమంగా వ్యాప్తి తగ్గిపోయింది. దీంతో 2023, మే నెలలో కరోనాఅంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి ముగిసినట్లు డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది.

24 గంటల్లో 514 కొత్త కేసులు
మరోవంక, దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి కాస్త తగ్గినట్లు కనిపిస్తోంది. గత రెండు రోజులతో పోలిస్తే రోజూవారీ కేసుల్లో నేడు తగ్గుదల కనిపించింది. గత 24 గంటల వ్యవధిలో 514 కేసులు బయటపడినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తాజా కేసులతో కలిపి దేశంలో వైరస్‌ బారిన పడినవారి సంఖ్య 4,50,20,386కు చేరింది. ప్రస్తుతం దేశంలో 3,422 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక నిన్న ఒక్కరోజే మూడు మరణాలు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఇద్దరు, కర్ణాటకలో ఒకరు మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు.