7న ఇజ్రాయిల్ పై దాడుల‌కు ప్రేరేపించిన హమాస్ క‌మాండ‌ర్ హ‌తం

7న ఇజ్రాయిల్ పై దాడుల‌కు ప్రేరేపించిన హమాస్ క‌మాండ‌ర్ హ‌తం
హ‌మాస్ ఉగ్రసంస్ధ ల‌క్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ ముప్పేట దాడితో విరుచుకుప‌డుతోంది. వారం రోజులుగా గాజాపై భీక‌ర దాడులు చేప‌డుతున్న ఇజ్రాయెల్ హ‌మాస్‌ను తుద‌ముట్టించేందుకు యుద్ధాన్ని కొన‌సాగిస్తోంది. ఇక ఇజ్రాయెల్‌-హ‌మాస్ ఘ‌ర్ష‌ణ‌ల్లో ఇప్ప‌టివ‌ర‌కూ మ‌ర‌ణించిన వారి సంఖ్య 9800 దాట‌డం ఆందోళ‌న రేకెత్తిస్తోంది.
 
గాజాలో హ‌మాస్ స్ధావ‌రాలే ల‌క్ష్యంగా ఉగ్ర‌మూక‌ల‌పై ఇజ్రాయెల్ విరుచుకుప‌డుతోంది. వైమానిక దాడుల‌ను కొన‌సాగిస్తూనే భూత‌ల దాడుల‌తోనూ గాజాపై ముప్పేట దాడిని ముమ్మ‌రం చేసింది. ఇక అక్టోబ‌ర్ 7న ఇజ్రాయెల్‌పై హ‌మాస్‌ను మెరుపు దాడుల‌కు ప్రేరేపించిన ఉగ్ర సంస్ధ క‌మాండ‌ర్‌ను ఇజ్రాయెల్ బ‌ల‌గాలు హ‌త‌మార్చాయి.

హ‌మాస్ బీట్ ల‌హియా బెటాలియ‌న్ క‌మాండ‌ర్‌ను మట్టుబెట్టామ‌ని ఇజ్రాయెల్ భ‌ద్ర‌తా ద‌ళం (ఐడీఎఫ్‌) ఐఎస్ఏ సంయుక్త ప్ర‌క‌ట‌న‌లో ధ్రువీక‌రించాయి. హ‌మాస్ నార్త‌న్ బ్రిగేడ్ బీట్ ల‌హియా బెటాలియ‌న్ కమాండ‌ర్‌, అక్టోబ‌ర్ 7 మెరుపు దాడుల‌కు ప్రేరేపించిన నిసాం అబు అజిన ఐడీఎఫ్ యుద్ధ విమానాల దాడిలో ప్రాణాలు విడిచాడ‌ని ఐడీఎఫ్‌, ఐఎస్ఏ ఇంటెలిజెన్స్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

షిన్‌బెట్ అందించిన ఇంటెలిజన్స్ సమాచారం ఆధారంగా హమాస్ మిలిటెంటు గ్రూపు కీలక స్థావరాలపై ఇజ్రాయెల్ ఫైటర్ జెట్‌లు దాడి చేశాయి. ఈ దాడుల్లో హమాస్ నార్తర్న్ డివిజన్ కమాండర్ నసీమ్ అబు అజినా మరణించినట్లు ఇజ్రాయెల్ ఇంటెలిజన్స్ వర్గాలు ధ్రువీకరించాయి.అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌లోని కిబ్బుట్జ్,నెతివ్ హసారా ప్రాంతాలపై హమాస్ మిలిటెంట్ల దాడుల వెనుక మాస్టర్‌మైండ్ నసీమ్’ అని ఓ ట్వీట్‌లో తెలిపారు.

అబు అజిన గ‌తంలోనూ హ‌మాస్‌లో చురుకుగా వ్య‌వ‌హ‌రించాడు. మిలిటెంట్ గ్రూప్ యూఏవీ డెవ‌ల‌ప్‌మెంట్‌లోనూ కీల‌క పాత్ర పోషించాడు. ఉగ్ర సంస్ధ పారాగ్లైడ‌ర్స్ విభాగంలోనూ ప‌నిచేశాడు. ఐడీఎఫ్ భూత‌ల దాడుల‌ను నిలువ‌రించ‌డంలో హ‌మాస్ ఉగ్ర సంస్ధ‌కు అజిన నిష్క్ర‌మ‌ణ పెద్ద ఎదురుదెబ్బ‌గా భావిస్తున్నారు.

హ‌మాస్ దాడి అనంత‌రం 1400 మంది ఇజ్రాయిలీలు మ‌ర‌ణించ‌గా, గాజాపై గ‌త కొద్దిరోజులుగా వైమానిక‌, భూత‌ల దాడుల‌ను ఇజ్రాయెల్ తీవ్ర‌త‌రం చేయ‌డంతో పాల‌స్తీనాలో 8400 మందికిపైగా మృత్యువాత ప‌డ్డారు.