బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం

బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని కేంద్ర మంత్రి జి. కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన కార్యక్రమంలో కాజిపేట వరకు పొడిగించిన పుణె (హడప్సర్‌)-హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును కేంద్ర మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. రైలును పొడిగించడంతో తెలంగాణలో మరికొన్ని జిల్లాల ప్రయాణికులకు పూణే రైలు అందుబాటులోకి వస్తుందని కిషన్ రెడ్డి చెప్పారు. 
ఇకపై హడప్సర్‌ వెళ్లే రైలు నాంపల్లి స్టేషన్‌కు బదులుగా సికింద్రాబాద్‌ స్టేషన్‌ మీదుగా రాకపోకలు సాగిస్తుంది. అక్టోబర్‌ 9వ తేదీ నుంచి మార్పులు అమల్లోకి వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం సహకరించినా, సహకరించకపోయినా తెలంగాణ అభివృద్ధికి కేంద్రం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందని కిషన్ రెడ్డి చెప్పారు.
కాజీపేట- పుణెల మధ్య నడిచే నెం.17014/17013 ఎక్స్‌ప్రెస్‌ వారంలో మూడురోజులు నడువనుంది. ప్రతి మంగళ, శుక్ర, ఆదివారం ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. కాజీపేట నుంచి పుణెకు 16 గంటల్లో చేరుకుంటుంది. సాయంత్రం 6.15కి కాజీపేట నుంచి బయల్దేరే రైలు 6.59కి జనగామ చేరుతుంది. 

రాత్రి 7.29కి భువనగిరి, రాత్రి 8.25కి సికింద్రాబాద్‌కు వస్తుంది. మరుసటిరోజు ఉదయం 10.50 గంటలకు హడప్సర్‌ చేరుకుంటుంది. కాజీపేట నుంచి సికింద్రాబాద్‌కు 2 గంటల్లో, పుణెకు 16 గంటల్లో ప్రయాణ సమయం ఉంటుంది.

వీటితో పాటు ట్రైన్ నంబర్ 17014 / 17013 కర్నూల్ వరకు పొడగించిన జైపూర్ – కాచిగూడ ఎక్స్‌ప్రెస్, ట్రైన్ నంబర్‌ 19713/19714 రాయచూర్ వరకు పొడగించిన నాందేడ్ – తాండూర్ డెయిలీ ఎక్స్‌ప్రెస్‌, ట్రైన్‌ నంబర్ 17664/17663 బోధన్‌ వరకు పొడగించిన కరీంనగర్ – నిజామాబాద్ ఎక్స్‌ప్రెస్‌, ట్రైన్‌ నంబర్ 07894/07893 ప్యాసింజర్ రైళ్లను కూడా కిషన్ రెడ్డి వర్చువల్‌గా ప్రారంభించారు.