
బిజెపి ప్రభుత్వంలో ఏ పని కావాలన్నా 40 శాతం కమిషన్ లేనిది కావడం లేదంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసి, అవినీతి అస్త్రంతో అధికారంలోకి వచ్చిన కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం రెండు నెలలకే అవినీతి ఆరోపణలతో తలమునకలవుతున్నది. ప్రతిపక్షాలు కాకుండా సొంత పార్టీ వారే తమ మంత్రులపై అవినీతి ఆరోపణలు చేస్తుండడంతో సిద్దరామయ్య ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరి అవుతుంది.
తాజాగా, కర్ణాటక వ్యవసాయ శాఖ మంత్రి చెలువరాయ స్వామి లంచం కోసం అధికారులను వేధిస్తున్నారని ఆరోపిస్తూ వారు గవర్నర్‌కి రాసిన ఫిర్యాదు లేఖ ఇటీవల సోషల్‌మీడియాలో వైరల్ అయింది. ఈ ఫిర్యాదు లేఖతో కర్ణాటక కాంగ్రెస్ కలవరానికి గురైంది. అయితే, సోషల్‌మీడియాలో వైరల్ అయిన లేఖ నకిలీదని సిద్ధరామయ్య ప్రభుత్వం కొట్టిపారేసింది. తాజాగా ఫిర్యాదు లేఖకు సంబంధించిన కేసును సిఐడికి అప్పగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
కాగా, వ్యవసాయ శాఖకు చెందిన జాయింట్ డైరెక్టర్లను ఆ శాఖా మంత్రి చెలువరాయ స్వామి ప్రతి నెలా రూ. 6 నుండి రూ.8 లక్షల్ని లంచం ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. మంత్రి లంచం వ్యవహారంపై మాండ్య జిల్లా వ్యవసాయశాఖకు చెందిన ఏడుగురు అసిస్టెంట్ డైరెక్టర్లు గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్‌కు రాసిన లేఖ సోషల్‌మీడియాలో వైరల్ అయింది.
ఈ లేఖను గవర్నర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వందితా శర్మకు పంపించి దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని సూచించారనే వార్తలు వచ్చాయి. “మంత్రి తమనుండి లంచం డిమాండ్ చేస్తున్నారని మండ్య జిల్లా నుండి పలు తాలూకాలు సంయుక్త వ్యవసాయ డైరెక్టర్ల నుండి నాకు సమాచారం వచ్చింది. తీవ్రమైన ఈ అంశంపై వెంటనే తాను చర్య తీసుకోనని పక్షంలో తాము విషం తీసుకొని ఆత్మహత్యకు పాల్పడతామని వారు నాకు తెలిపారు. ఈ విషయమై వెంటనే దర్యాప్తు జరిపి తాను చర్య తీసుకోమని నేను కోరుతున్నాను” అంటూ గవర్నర్ తన లేఖలో ప్రధాన కార్యదర్శిని కోరారు.
మండ్య, మలవల్లి, కృష్ణరాజపేట, పాండవపుర, నాగమంగళ, శ్రీరంగపట్టణ, ముద్దుల నుండి ఏడుగురు వ్యవసాయ జాయింట్ డైరెక్టర్ల నుండి తనకు ఫిర్యాదులు అందిన్నట్లు ఆ లేఖలో గవర్నర్ తెలిపారు. ఆయా ఫిర్యాదులను కూడా అయన ప్రధాన కార్యదర్శికి ఆ లేఖతో పాటు పంపారు. ఈ లేఖ వ్యవహారంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందిస్తూ మంత్రిపై రాసిన లేఖ నకిలీదని, బిజెపి జెడిఎస్లే సృష్టించాయని ఆరోపించారు. అయినప్పటికీ మంత్రిపై వచ్చిన ఆరోపణల కేసును సిఐడికి అప్పగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది.
అయితే అంతకుముందు సిద్ధరామయ్య ఈ లేఖపై మాట్లాడుతూ ఏ అధికారి లేఖ రాయలేదని వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ చెప్పారని తెలిపారు. అయితే సిద్ధరామయ్య వ్యాఖ్యలపై బిజెపి, జెడిఎస్తోపాటు ఆమ్ఆద్మీ పార్టీలు మండిపడ్డాయి. ఆ లేఖ నకిలీది అయితే గవర్నర్ ఎందుకు స్పందిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. అవినీతి ఆరోపణలు వచ్చిన మంత్రిని ముఖ్యమంత్రి వెనకేసుకు రావడం దారుణమని ప్రతిపక్షాలు సిఎంని విమర్శించాయి.
More Stories
భారత్‌ను చైనాకు దూరం చేసి అమెరికాకు దగ్గర చేసుకోవడమే
`ఓటు యాత్ర’ జనాన్ని ఆకట్టుకున్నా, ఓట్లు పెంచలేదు!
ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం