
సీనియర్ ఐపిఎస్ అధికారి రవి సిన్హాను రిసెర్చ్ అండ్ ఎనాలసిస్ వింగ్ (ఆర్‌ఎడబ్ల్యు-రా) నూతన చీఫ్‌గా కేంద్ర ప్రభుత్వం సోమవారం నియమించింది. నూతన రా చీఫ్‌గా 1988 బ్యాచ్ ఛత్తీస్‌గఢ్ క్యాడర్‌కు చెందిన ఐపిఎస్ అధికారి రవి సిన్హా నియామకానికి క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపిందని కేంద్ర వ్యక్తిగత మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుతం రా చీఫ్‌గా ఉన్న సమంత్ కుమార్ గోయెల్ పదవీకాలం ఈ నెల 30న ముగియనుండటంతో ఆయన స్థానంలో కొత్త చీఫ్‌గా రవి సిన్హాను నియమించినట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. రవి సిన్హా రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారని తెలిపింది. రవి సిన్హా ప్రస్తుతం క్యాబినెట్ సెక్రెటేరియట్ స్పెషల్ సెక్రెటరీగా ఉన్నారు.
జూన్ 2019లో, గోయెల్ అనిల్ ధస్మాన్ అనంతరం రా చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. 2022లో గోయెల్ పదవీ కాలాన్ని మరో ఏడాది పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. విదేశాల్లో అత్యంత కీలకమైన నిఘా కార్యకలాపాలను ఈ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ – ‘రా’ నిర్వహిస్తూ ఉంటుంది.
ఛత్తీస్‌గఢ్ కేడర్‌కు చెందిన రవి సిన్హా గత ఏడు సంవత్సరాలుగా రీసెర్చ్ అండ్ అనాలసిస్ ఆపరేషనల్ విభాగంలో చీఫ్‌గా సేవలు అందిస్తున్నారు. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలో రవి సిన్హా విద్యాభ్యాసం పూర్తి చేశారు. అయితే రవి సిన్హాకు సంబంధించిన వ్యక్తిగత వివరాలు చాలా వరకు రహస్యంగా ఉన్నాయి.
దేశంలోనే అత్యంత కీలకమైన భద్రతా విభాగంలో పనిచేసే అధికారులకు సంబంధించిన వ్యక్తిగత వివరాలు చాలా గోప్యంగా ఉంటాయి. అందుకే వాటిని అధికారులు బయటికి వెల్లడించరు. భారత ఇంటెలిజెన్స్ విభాగంలో ప్రతిభావంతుడిగా రవి సిన్హాకు పేరుంది. ఆయన రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్‌లోని వివిధ విభాగాల్లో సేవలు అందించారు.
భారత్‌కు పొరుగున ఉన్న వివిధ దేశాల్లో జరిగే పరిణామాలపై రవి సిన్హాకు మంచి పట్టు ఉండటంతో ఆయనకు ఈ పదవి దక్కేందుకు అర్హత ఉంది. ముఖ్యంగా జమ్ముకశ్మీర్, ఈశాన్య భారత్, వామపక్ష తీవ్రవాదంపై రవి సిన్హా పని చేశారు.
More Stories
మణిపుర్ ప్రజలారా మీ వెంట నేనున్నా….
ఓటు బ్యాంకు రాజకీయాలతో నష్టపోతున్న ఈశాన్యం
అభద్రతా భావంతోనే అమెరికా సుంకాలు