
ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు ముందు న్యూజెర్సీలోని ఓ రెస్టారెంట్ వినూత్న ప్రయత్నం ద్వారా ఆహ్వానం పలికింది. `మోదీజీ తాలి’ పేరుతో ప్రత్యేక వంటకాన్ని రెస్టారెంట్ యజమాని, చెఫ్ శ్రీపాద్ కులకర్ణి రూపొందించారు.
ఇందులో కిచిడి, రసగుల్లా, కశ్మీరి దమ్ అలూ, ఇడ్లి, దోక్లా, చాంచ్, పాపడ్, సార్సన్ కా సాగ్ ఉన్నాయి. స్థానికంగా నివసించే భారత సంతతి వారి డిమాండ్ మేరకు ఈ తాలిని రూపొందించినట్టు చెఫ్ కులకర్ణి తెలిపారు. 2023 మిల్లెట్స్ సంవత్సరానికి నివాళిగా, ఈ తాలిలో మిల్లెట్స్ తో చేసిన పదార్థాలు కూడా ఉన్నాయి.
భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ గౌరవార్థం మరో ప్రత్యేక తాలిని రూపొందించనున్నట్లు కులకర్ణి తెలిపారు. మోదీ తాలి గురించి మాట్లాడుతూ.. ‘‘ఈ తాలిని ప్రారంభించబోతున్నాం, దీనికి ఎంతో ఆదరణ వస్తుందని నేను నమ్మకంగా ఉన్నాను. అనంతరం డాక్టర్ జైశంకర్ పేరుతోనూ తాలిని తీసుకురావాలనే ప్రణాళిక ఉంది. ఎందుకంటే ఆయన కూడా భారతీయ అమెరికన్ కమ్యూనిటీకి రాక్ స్టార్ గా ఉన్నారు’’ అని కులకర్ణి వివరించారు.
మోదీకి సంబంధించి ప్రత్యేక వంటకం ఇదే మొదటిది కాదు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా గత ఏడాది సెప్టెంబర్ 17న ఢిల్లీకి చెందిన ఓ రెస్టారెంట్ ‘56 అంగుళాల మోదీజీ’ పేరుతో తాలిని తీసుకురావడం గమనార్హం. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆహ్వానం మేరకు జూన్ 21 నుంచి నాలుగు రోజుల పర్యటనకు ప్రధాని మోదీ అమెరికాకు వెళ్లనున్నారు.
ఈ సందర్భంగా మోదీకి బైడెన్ దంపతులు ఘన స్వాగతం చెప్పడంతో పాటు వైట్ హౌస్‌లో విందు ఇవ్వనున్నారు. అమెరికా, భారత్ సంబంధాలను ఈ పర్యటన మరింత బలోపేతం చేస్తుందని భారత విదేశాంగ శాఖతో పాటు వైట్‌హౌస్ పేర్కొంది. మరోవైపు, మోదీకి స్వాగతం పలికేందుకు అక్కడ స్థిరపడిన భారతీయులు సైతం ఏర్పాట్లు చేస్తున్నారు.
More Stories
నేపాల్ తాత్కాలిక నాయకత్వంపై నేపాల్ జెన్ జెడ్‌లో చీలిక!
వారణాసిలో చదివిన నేపాల్ కాబోయే ప్రధాని కార్కి
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కిని ఒప్పించిన ఆర్మీ చీఫ్