టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీక్ వ్యవహారం కలకలం రేపడంతో ఇప్పటివరకు అందుకు బాధ్యత వహించవలసిన పలకవర్గంపై ఎటువంటి చర్యలు తీసుకోనని తెలంగాణ ప్రభుత్వం పరీక్షా విధానంలో సమూల మార్పులకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే కొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రత్యేకంగా పరీక్షల విభాగం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
పరీక్షల విభాగం పర్యవేక్షణకు ఐఏఎస్ అధికారిని నియమించింది. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ అదనపు కార్యదర్శి హోదాలో ఎగ్జామినేషన్ కంట్రోలర్‌గా 2017 బ్యాచ్ ఐఏఎస్ అధికారి బీఎం సంతోష్‌ను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం బీఎం సంతోష్ ఔటర్ రింగ్‌రోడ్డు ప్రాజెక్టు డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
అలాగే, కమిషన్‌లో మరో 9 పోస్టులను భర్తీ చేస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్నది. డిప్యూటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్, సీనియర్ నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్, జూనియర్ నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్, సీనియర్ ప్రోగ్రామర్, జూనియర్ ప్రోగ్రామర్, లా ఆఫీసర్ (జూనియర్ సివిల్ జడ్జి క్యాడర్) పోస్టులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
ఆన్‌లైన్‌లో రాత పరీక్ష
ఇలా ఉండగా, టీఎస్‌పీఎస్సీ మరో కీలక నిర్ణయం తీసుకొన్నది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) సివిల్ పరీక్షను మే 21, 22 తేదీల్లో ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నట్టు టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ తెలిపారు. 1,540 ఏఈఈ (సివిల్) ఉద్యోగాల భర్తీకి నిరుడు సెప్టెంబర్ 3న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. మే 21న ఓఎంఆర్ పద్ధతిలో పరీక్ష నిర్వహించనున్నట్టు గతంలో ప్రకటించింది. అయితే, టీఎస్‌పీఎస్సీలో ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో పరీక్షలన్నీ ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలని భావిస్తున్నది. ఇందులో భాగంగా ఏఈఈ (సివిల్) పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని నిర్ణయం తీసుకొన్నది.
పేపర్ లీకేజీ కేసులో మరో ఇద్దరు అరెస్ట్
టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీ కేసులో మరో ఇద్దరిని సిట్ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మైసయ్య, జనార్ధన్‌లను అరెస్ట్ చేసింది. అరెస్టయిన ఈ ఇద్దరు తండ్రి కొడుకులు కావడం గమనార్హం. టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీక్ కేసులో ఇప్పటివరకు 19 మందిని అరెస్ట్ చేసింది.
ఢాక్యా నాయక్ నుండి రూ. 2 లక్షలకు ఎఇ ఎగ్జామ్ పేపర్ వీరు కొనుగోలు చేసినట్టుగా సిట్ బృందం గుర్తించింది. ఈ కేసులో నిందితుల జాబితా పెరిగిపోతోంది. విచారణ చేసే కొద్ది కొత్త కొత్త పేర్లు వెలుగు చూస్తున్నాయి. నిందితుల ఇచ్చిన సమాచారం, వారి ఫోన్ డేటా ఆధారంగా కేసును చాలా వేగవంతంగా దర్యాప్తు చేస్తున్నారు.

More Stories
జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఏపీ బిజెపి నేతల ప్రచారం!
‘కాషాయ జెండా’ తొలగింపుతో దుమారం
అప్పుల్లో అగ్రగామిగా తెలుగు రాష్ట్రాలు