
ఆంధ్రప్రదేశ్ లో 32 కి.మీ పొడవైన 6 వరుసల గ్రీన్‌ఫీల్డ్ హై వే నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. బెంగళూరు – విజయవాడ ఎకనమిక్ కారిడార్‌లో భాగంగా రాష్ట్రంలోని చంద్రశేఖరపురం నుంచి పోలవరం వరకు యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్‌ఫీల్డ్ హై వే నిర్మించేందుకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రూ. 1,292.65 కోట్లు మంజూరు చేశారు.
‘భారత్‌మాల పరియోజన’ పథకంలో భాగంగా హైబ్రిడ్ యాన్యుటీ పద్ధతిలో ఈ రహదారి నిర్మాణం చేపట్టనున్నట్టు కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. విజయవాడ – బెంగళూరు నగరాలను కలిపేలా గ్రీన్‌ఫీల్డ్ ఎకనమిక్ కారిడార్‌లో భాగంగా నేషనల్ హై వే 544(జీ)లో ఇదొక భాగమని వెల్లడించింది.
బెంగళూరు నుంచి ప్రారంభమై కొడికొండ చెక్‌పోస్ట్ (కోడూరు గ్రామం) వరకు ఇప్పటికే ఉన్న బెంగళూరు-హైదరాబాద్ ( ఎన్ హెచ్ -44) హైవే పై ఈ కారిడార్ కొనసాగుతుంది. అక్కడి నుంచి దారిమళ్లి అద్దంకి సమీపంలోని ముప్పవరం వరకు 342.5 కి.మీ మేర పూర్తిస్థాయిలో గ్రీన్‌ఫీల్డ్ హై వే నిర్మాణం జరుపుకోనుంది.
ముప్పవరం వద్ద ఎన్ హెచ్-16కు అనుసంధానించి విజయవాడ వరకు రహదారి కొనసాగుతుంది. ఇందులో కొత్తగా నిర్మించాల్సిన గ్రీన్ ఫీల్డ్ హైవేలో ప్రకాశం జిల్లాలో నిర్మాణం జరుపుకోనున్న భాగాన్ని మొత్తం 14 ప్యాకేజిలుగా విభజించి త్వరితగతిన పనులు పూర్తిచేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో 32 కి.మీ పొడవైన ప్యాకేజి పనులకు కేంద్రం నిధులు మంజూరు చేసింది.
More Stories
టీటీడీ పరకామణిలో ఫారిన్ కరెన్సీ దోపిడీపై సీఐడీ దర్యాప్తు
పోలవరం నిర్వాసితులకు పునరావాస హామీలు నెరవేర్చాలి
టిడిపిలో చేరిన ముగ్గురు వైసీపీ ఎమ్యెల్సీలు