బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే

బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీయేనని ప్రజలు భావిస్తున్నారని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తెలిపారు. ఉప ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనని చెబుతూ ఎన్నికలెప్పుడొచ్చినా అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సంస్థాగత నిర్మాణం విషయంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ లతో పోలిస్తే బీజేపీయే బలంగా ఉందని చెప్పారు.
 
పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ప్రారంభమైన బూత్ స్వశక్తీకరణ్ అభియాన్ వర్క్ షాప్ లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, జాతీయ కార్యదర్శి అరవింద్ మీనన్, తమిళనాడు సహా ఇంఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు ఎన్.ఇంద్రసేనారెడ్డి, విజయశాంతి, జితేందర్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు తదితరులతో పాల్గొన్నారు.
 
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు బీజేపీకి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారని చెబుతూ 34 వేల పోలింగ్ బూత్ కమిటీలుంటే అందులో 80 శాతం కమిటీలను పూర్తి చేశామని సంజయ్ తెలిపారు. స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లతో పార్టీకి మంచి వాతావరణం ఏర్పండి. ప్రజల నుండి మంచి స్పందన లభిస్తోందని తెలిపారు.
 టీఆర్ఎస్ వైఫల్యాలు, కేంద్ర ప్రభుత్వ విజయాలతోపాటు స్థానిక సమస్యలను ప్రస్తావించడం ద్వారా ప్రజలకు బీజేపీ పట్ల నమ్మకం కలుగుతోందని సంజయ్ సూచించారు.
వీటితోపాటు ఎన్నికల్లో గెలిచాక ఏ హామీలను అమలు చేస్తామో చెబుతున్నామని గుర్తు చేశారు.  అందులో భాగంగానే ఉచిత విద్య, ఉచిత వైద్యం, అందరికీ ఇండ్లు, రైతులకు ఫసల్ బీమాను అమలు చేస్తామని చెప్పామని, కేంద్రం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తామని చెబుతున్నామని వివరించారు.
 
టీఆర్ఎస్ ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదో.. అభివృద్ధి ఎందుకు చేయడం లేదో చెప్పడం లేదని విమర్శించారు. వాటిపై సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో బీఆర్ఎస్ నేతలు మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ ను రగిలించడానికే ప్రధానమంత్రి మోదీపైన, బీజేపీ నేతలపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని ధ్వజమెత్తారు.