ఆంధ్రప్రదేశ్ పూర్తిగా దివాలా తీసింది

ఆంధ్రప్రదేశ్ పూర్తిగా దివాలా తీసింది
ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక పరిస్థితి బాగోలేదని, రాష్ట్రం పూర్తిగా దివాలా తీసిందని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రి దేవ్‌సింహ్‌ చౌహాన్‌ విమర్శించారు. కర్నూలు జిల్లా, ఆదోనిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎంపీ టీజీ వెంకటేష్‌తో కలిసి కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా విపక్ష నేతలను భయపెడుతున్నారని వైసిపి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం, ఖనిజ సంపద ద్వారా వచ్చే ఆదాయంతోనే ప్రభుత్వం నడుస్తోందని పేర్కొంటూ ఆ ఆదాయమంతా ఎక్కడికి పోతుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు రోడ్లపై ఉన్నారని, వారి హక్కులను పూర్తిగా కాలరాస్తున్నారని మండిపడ్డారు. 10వ తేదీ దాటినా రాష్ట్ర ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని విస్మయం వ్యక్తం చేశారు.

 
ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధికారంలోకి వస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయని కేంద్ర మంత్రి దేవ్‌సింహ్ స్పష్టం చేశారు. దేశంలో తొమ్మిదేళ్ల ప్రధాని నరేంద్ర మోదీ పరిపాలనలో అద్భుతాలు సృష్టించారని తెలిపారు. దేశంలో సాంకేతికతతో కూడిన పారదర్శక పాలన అందిస్తున్నారని తెలిపారు. ఒక వ్యక్తి, ఒక వర్గం కాకుండా అందరూ ఎదగడానికి బీజేపీ కృషి చేస్తోందని పేర్కొన్నారు.