ఆస్కార్ అవార్డు రేసులో ఎన్టీఆర్!

ఆస్కార్ అవార్డు రేసులో ఎన్టీఆర్!

ప్రపంచ సినిమా లోకంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డు ఆస్కార్ అవార్డు. ఆస్కార్ బరిలో ఒక్కసారైనా నిలువాలని ప్రతి నటుడూ కోరుకుంటారు. అలాంటిది ఇప్పుడు మన టాలీవుడ్ పరిశ్రమ నుంచి ఆస్కార్ బరిలో ఎన్టీఆర్ నిలిచినట్లు తెలుస్తుంది.

ఇటీవల అమెరికాకు చెందిన ప్రముఖ ఎంటర్‌టైన్మెంట్‌ మీడియా సంస్థ ‘వెరైటీ’ టాప్‌-10 బెస్ట్‌ యాక్టర్స్‌ జాబితాలో ఎన్టీఆర్‌కు 10వ స్థానం ఇచ్చింది. తాజాగా మరో అమెరికా వార్తా సంస్థ  యూఎస్‌ఎ టుడే అనే దిన వార్తాపత్రిక ప్రకటించిన ఈ జాబితాలో ఎన్టీఆర్‌కు అగ్రస్థానం దక్కడం విశేషం. ‘ఈ జాబితాను పరిగణించండి’ అంటూ అకాడమీ ఓటర్లకు సూచించింది యూఎస్‌ఎ టుడే.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాని యాక్షన్‌-ప్యాక్డ్‌ మ్యూజికల్‌ అడ్వెంచర్‌గా పేర్కొన్న యూఎస్‌ఎ టుడే, ఈ సినిమాను ఇద్దరు ఇండియన్‌ మెగాస్టార్స్‌ ఆడియన్స్‌-ఫ్రెండ్లీ పవర్‌హౌస్‌గా మార్చారని కొనియాడింది. ఈ సినిమాలో రామ్‌ చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ స్నేహితులుగా నటించారని, ఇద్దరూ అద్భుతంగా ఫైట్లు, డాన్సులు చేశారని ప్రశంసించింది.

అయితే, ఇద్దరిలో ఒక్కరిని మాత్రమే తీసుకోవాలి కాబట్టి క్రూర జంతువులకు నాయకత్వం వహించడమే కాకుండా మోటార్‌ సైకిల్‌ను అవలీలగా ఎత్తికుదేసిన ఎన్టీఆర్‌ను తాము నామినేట్‌ చేస్తున్నట్టు పేర్కొంది.

దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలితో తెలుగు సినిమా సత్తా ను ప్రపంచానికి చాటి చెప్పగా, ఇప్పుడు ఆర్ఆర్ఆర్ తో మరోసారి తెలుగు పరిశ్రమ  గురించి హాలీవుడ్ అగ్ర దర్శకులు మాట్లాడుకునేలా చేయడమే కాదు ఏకంగా ఆస్కార్ బరిలో నిలిచేలా చేసాడు. ఆర్ఆర్ఆర్ విడుదలకు ముందు, విడుదల తర్వాత కూడా అనేక అవార్డ్స్ ను ఈ చిత్రం తన ఖాతాలో వేసుకుంటూ వస్తుంది.

పలు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను ఆర్ఆర్ఆర్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో నటించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేర్లు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో ఎన్టీఆర్ పలికించిన హావభావాలకు పిచ్చి క్రేజ్ వచ్చింది.

 ఆర్ఆర్ఆర్లో యాక్షన్‌ సీన్స్‌లోనే కాకుండే ఎమోషనల్‌ పరంగానూ తారక్‌ నటన కంటతడి పెట్టించింది. దీంతో ఆస్కార్‌ రేసులో ఉత్తమ నటుడి విభాగంలో తారక్‌ నిలుస్తారని భావిస్తున్నారు. ఇక ఇప్పటికే ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు సాంగ్ కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు మాత్రమే కాకుండా, క్రిటిక్స్ ఛాయిస్ పురస్కారాల్లో కూడా ఈ సినిమా అవార్డును సొంతం చేసుకోవడం గమనార్హం.

ఇదిలా ఉండగా త్వరలో మార్చి 12 న అమెరికాలో అట్టహాసంగా జరగనున్న ఆస్కార్ అవార్డుల్లో కూడా ఆర్ఆర్ఆర్ నామినేషన్స్ దక్కించుకోవడం విశేషం. ఫైనల్ గా జరిగిన ఆస్కార్ షార్ట్ లిస్టులో ఆర్ఆర్ఆర్ స్థానాన్ని దక్కించుకోవడంతో ఆస్కార్ అవార్డుల్లో పోటీపడే అర్హతను దక్కించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆర్ఆర్ఆర్ కు గాను హీరో ఎన్టీఆర్ పేరు ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తూ ఉండడం గమనార్హం. పలు అంతర్జాతీయ వార్తా సంస్థలు ఆస్కార్ రేసులో ఎన్టీఆర్ పేరును ప్రముఖంగా ప్రస్తావించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.