పంజాబ్, హర్యానా సీఎంల ‘హత్య’కు కుట్ర.. ఇళ్ల వద్ద ‘లైవ్ బాంబ్’!

పంజాబ్, హర్యానా సీఎంల ‘హత్య’కు కుట్ర.. ఇళ్ల వద్ద ‘లైవ్ బాంబ్’!
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్, హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ అధికార నివాసాల వద్ద బాంబులు కనిపించటం తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఛండీఘడ్‌లోని సీఎం భగవంత్ మాన్ ఇంటి ప్రాంగణంలోని మామిడి తోటలో పేలడానికి సిద్ధంగా ఉన్న లైవ్ బాంబును గుర్తించారు. హెలీప్యాడ్ వద్ద ఈ బాంబును ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.
 
అధికారులు బాంబును గుర్తించ‌డంతో పెను ముప్పు త‌ప్పింది. పంజాబ్ సీఎం నివాసం, హెలిప్యాడ్‌కు స‌మీపంలోని మామిడి తోట‌లో సోమ‌వారం సాయంత్రం 4.30 గంట‌ల‌కు ట్యూబ్‌వెల్ ఆప‌రేట‌ర్ బాంబును గ‌మ‌నించి అధికారుల‌కు స‌మాచారం అందించాడు. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన అధికారులు బాంబును నిర్వీర్యం చేసే సిబ్బందిని పిలిపించారు
 
ఈ విషయం తెలుసుకున్న వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగారు. సీఎం ఇంటికి సమీపంలో ఉన్న ప్రాంతాన్ని మొత్తం ఖాళీ చేయించారు. బాంబ్ స్క్వాడ్‌తో పాటు సైన్యానికి చెందిన ఓ బృందాన్ని పిలిపించి.. బాంబును స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేశారు. దీంతో.. అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అయితే.. ఈ బాంబ్ ఘటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ బాంబును ఎవరు ఏర్పాటు చేశారు. సీఎం ఇంటి ఆవరణలోనే బాంబు పెట్టగలిగారంటే దీని వెనక ఎవరెవరి హస్తం ఉంది.. అన్న కోణాల్లో అధికారులు దర్యాప్తు చేపట్టారు.
 
“పంజాబ్, హర్యానా ముఖ్యమంత్రుల అధికారిక నివాసాలకు 500-700 మీటర్ల దూరంలో ఉన్న నయాగావ్-కన్సల్ రహదారి దగ్గర ఇక్కడ లైవ్ బాంబ్ షెల్ గుర్తించాం. పోలీసులతో పాటు బాంబు స్క్వాడ్ సహాయంతో దాన్ని స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేశాం. ఆర్మీ బృందాలు.. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. తదుపరి విచారణ కొనసాగుతోంది” అని నోడల్ అధికారి సంజీవ్ కోహ్లీ తెలిపారు.
 
ఇదిలా ఉంటే.. కొద్ది రోజులుగా పంజాబ్‌లో కలిస్థాన్ ఉద్రవాదుల కదలికలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సరిహద్దుల్లోని పలు ప్రాంతాల్లో రాకెట్లతో దాడులు కూడా నిర్వహించారు. కాగా.. ఇప్పుడు సీఎంల ఇంటి ఆవరణలో పేలడానికి సిద్ధం ఉన్న బాంబు దొరకటంతో… ఈ ఘటనలో కలిస్థాన్ ఉగ్రవాదుల హస్తం ఏమైనా ఉందా అనే అనుమానాన్ని కూడా అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఈ బాంబు ఘటనతో.. ఇద్దరు సీఎంల ఇంటి వద్ద భద్రతా భారీగా పెంచారు.