గురుకుల విద్య ప్రపంచానికే ఆదర్శం

గురుకుల విద్య ప్రపంచానికే ఆదర్శం
భారత గురుకుల విద్యా సంప్రదాయం ప్రపంచానికే ఆదర్శమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఇస్రో నుండి షార్క్ వరకు గురుకులాలకు చెందిన వారసత్వమే ఉందని  పేర్కొంటూ వీరు దేశం యొక్క ప్రతిభను శక్తివంతం చేశారని కొనియాడారు. 
శ్రీ స్వామినారాయణ గురుకుల్ రాజ్ కోట్ సంస్థాన్ 75వ అమృత్ మహోత్సవంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని ప్రసంగిస్తూ స్వామినారాయణ గురుకుల్ సంస్థ భవిష్యత్ మరింత ఉజ్వలంగా ఉండాలని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.
 
పేద విద్యార్థులకు సహాయం చేస్తున్నందుకు గురుకులంపై మోదీ ప్రశంసలు కురిపించారు.  పేద విద్యార్థుల విద్యను పూర్తి చేయడానికి గురుకులం రోజుకు ఒక రూపాయి వసూలు చేస్తుందని చెబుతూ  దీనివల్ల పేద విద్యార్థులు చదువుకో గలుగుతున్నారని చెప్పారు. నలంద, తక్షశిల వంటి పురాతన విశ్వవిద్యాలయాల వారసత్వాన్ని ప్రధాని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
ప్రాచీన కాలం నాటి గురుకులాల వైభవం, మహిమ, వైభవానికి ఈ సంస్థలు ఉదాహరణలు అని తెలిపారు. గార్గి, మైత్రేయి వంటి మహిళా సాధువులు చేసిన సేవలను కూడా ఆయన గుర్తు చేసుకుంటూ, లింగ సమానత్వం వంటి పదాలు పుట్టకపోయినప్పటికీ, గార్గి , మైత్రేయి వంటి మన సాధువులు శాస్త్రాలను అధ్యయనం చేసేవారని చెప్పారు.
నూతన జాతీయ విద్యా విధానం ద్వారా దేశంలో దూరదృష్టిగల, భావి కాల లక్షణాలున్న విద్యా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొంటూ  2014 నుంచి దేశంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటిలు), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎంలు), వైద్య కళాశాలల సంఖ్య చెప్పుకోదగ్గ స్థాయిలో పెరిగినట్లు తెలిపారు.
 2014 తర్వాత వైద్య కళాశాలల సంఖ్య 65 శాతం కన్నా ఎక్కువగా పెరిగిందని చెబుతూ భారత దేశ భవిష్యత్తు కాంతులీనాలంటే మన ప్రస్తుత విద్యా విధానం, విద్యా సంస్థలు గొప్ప పాత్ర పోషించవలసి ఉంటుందని తెలిపారు. స్వాతంత్ర్యం లభించిన అమృత కాలంలో విద్యా సంబంధిత మౌలిక సదుపాయాలను, విద్యా విధానాన్ని అత్యంత వేగంగా విస్తరిస్తున్నామని చెప్పారు. 
 
ప్రధాన మంత్రి కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం, శ్రీ స్వామి నారాయణ్ గురుకుల్ సంస్థాన్‌ను బాగా విస్తరించారు. ప్రస్తుతం దీనికి ప్రపంచవ్యాప్తంగా 40కిపైగా శాఖలు ఉన్నాయి. 25,000 మందికిపైగా విద్యార్థులకు పాఠశాల, అండర్‌గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యను అందించేందుకు సదుపాయాలు ఉన్నాయి.