తరగతి గదుల నిర్మాణంలో కేజ్రీవాల్ ప్రభుత్వం మరో కుంభకోణం 

ఇప్పటికే ఢిల్లీ మద్యం కుంభకోణంపై జరుగుతున్న దర్యాప్తుతో  ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం తాజాగా తరగతి గదుల నిర్మాణంలో జరిగిన అక్రమాలపై దర్యాప్తు ఎదుర్కోవలసి వస్తున్నది.  ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో 2,405 తరగతి గదుల నిర్మాణంలో రూ.1,300 కోట్ల మేరకు కుంభకోణం జరిగిందని విజిలెన్స్ డైరెక్టరేట్ విజిలెన్స్ డైరెక్టరేట్
ఆరోపించింది.
దీనిపై ప్రత్యేక నైపుణ్యంగల సంస్థ చేత దర్యాప్తు చేయించాలని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సిఫారసు చేసింది. ఢిల్లీ రాష్ట్రంలోని 193 పాఠశాలల్లో 2,405 తరగతి గదుల నిర్మాణంలో అనేక అక్రమాలు జరిగాయని విజిలెన్స్ డైరెక్టరేట్ ఆరోపించింది. ఈ అక్రమాలకు విద్యా శాఖ, ప్రజా పనుల శాఖలలోని అధికారుల్లో ఎవరు బాధ్యులో నిర్ణయించాలని చీఫ్ సెక్రటరీకి పంపిన నివేదికలో కోరింది.
టెండరు ప్రక్రియలో అనేక అక్రమాలు జరిగాయని, ప్రైవేటు వ్యక్తులు, బబ్బర్ అండ్ బబ్బర్ అసోసియేట్స్ ప్రమేయం ఎక్కువగా ఉందని తెలిపింది. అప్పటి పీడబ్ల్యూడీ మంత్రి చాంబర్‌లో జరిగిన సమావేశంలో బబ్బర్ అంఃడ్ బబ్బర్ అసోసియేట్స్ ప్రతినిధులు పాల్గొన్నారని తెలిపింది.  అధికారికంగా కన్సల్టెంట్‌గా నియమించకపోయినప్పటికీ ఈ సంస్థ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారని, టెండరు తర్వాత కూడా మార్పుల కోసం మంత్రిపై ప్రభావం చూపించారని ఆరోపించింది. దీనివల్ల అదనంగా రూ.205.45 కోట్లు ఖర్చు చేయవలసి వచ్చిందని పేర్కొంది.
రాజ్యాంగేతర సంస్థలు పరిపాలనను నడుపుతున్నాయని, అధికారులకు నియమ, నిబంధనలను నిర్దేశించాయని తెలిపింది. ప్రైవేటు వ్యక్తుల ఆదేశాలను అన్ని స్థాయుల్లోనూ అమలు చేశారని పేర్కొంది. దీనివల్ల భద్రతాపరమైన విషయాలకు ముప్పు జరగడంతోపాటు, పరిపాలనపరమైన అరాచకం ప్రబలుతుందని వివరించింది.
పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ ఈ తరగతి గదులను నిర్మించింది. ఈ పనుల్లో అక్రమాలు జరిగాయని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ 2020 ఫిబ్రవరి 17న ఇచ్చిన నివేదికలో పేర్కొంది. దీనిపై అభిప్రాయాలను తెలియజేయాలని లెఫ్టనెంట్ గవర్నర్ వి కె సక్సేనా ప్రధాన కార్యదర్శిని కోరడంతో, ఆయన విజిలెన్స్ డైరెక్టరేట్‌ను కోరారు.
ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు తరగతి గదులను నిర్మించాలని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ 2015 ఏప్రిల్‌లో ఆదేశించారు. ఈ బాధ్యతను ప్రజా పనుల శాఖకు అప్పగించారు. ఈ శాఖ ఓ సర్వేను నిర్వహించి, 7,180 తరగతి గదులు అవసరమని తెలిపింది. వాస్తవానికి అవసరమైనవి 2,405 గదులు మాత్రమేననే ఆరోపణలు ఉన్నాయి.
తరగది గదుల నిర్మాణంలో కేజ్రీవాల్ ప్రభుత్వం రూ 2,000 కోట్ల కుంభకోణంకు పాల్పడినట్లు ఢిల్లీ బిజెపి అధ్యక్షుడు, ఎంపీ మనోజ్ తివారి జులై, 2019లోనే ఆరోపించారు. ఈ కుంభకోణంలో కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఉన్నారని కూడా పేర్కొన్నారు. చదరపు అడుగు నిర్మాణంకు రూ 1,500 సాధారణంగా ఖర్చు అవుతుండగా, ఈ ప్రభుత్వం కాంట్రాక్టర్ కు రూ 8,000కు ఇచ్చినది వారు తెలిపారు.