పదేళ్లకోసారి ఆధార్ కార్డు అప్‌డేట్

దేశంలో ఇకపై ఆధార్ కార్డులను ప్రతి పది సంవత్సరాలకు ఓసారి నవీకరించుకోవాలి. ఈ మేరకు వినియోగదారులు ఆధార్‌కార్డులో సంబంధిత సమాచారంతో కూడిన బయోమెట్రిక్ డేటాను సవరించుకోవల్సి ఉంటుంది.

అప్‌డేట్‌కు సంబంధించి విశిష్ట గుర్తింపు అధీకృత భారత సంస్థ (ఉడాయ్) కీలక నిర్ణయం తీసుకుంది. అయితే 70 ఏళ్లకు పైబడిన వారిని ఈ తాజా నిబంధన నుంచి మినహాయించారు. ఆధార్ కార్డులు ఉన్నవారంతా ఇవి జారీ అయిన తరువాత నిర్థిష్టంగా పది సంవత్సరాలకు సంబంధించి ఆధార్ ప్రక్రియ అధికారుల సమక్షంలో సమాచార ఆధునీకరణకు దిగాల్సి ఉంటుందని సంస్థ వర్గాలు తెలిపాయి.

వినియోగదారులు తమ డేటాను ఆధునీకరించుకునే ప్రక్రియకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చే విధంగా ప్రోత్సహించడం జరుగుతుంది. ఎటువంటి అసమగ్రతలు లేకుండా చూసుకునేందుకు పౌరులు ఆధార్ బయోమెట్రిక్ ప్రక్రియలో భాగంగా దశాబ్దానికి ఓసారి తమ ముఖం, చేతివేళ్ల ముద్రలను స్కాన్‌కు దిగాల్సి ఉంటుంది.

వయోవృద్ధులకు ఈ మార్పు వర్తించదని తెలిపారు. ఇక 5 నుంచి 15 ఏండ్ల లోపు బాలలకు సంబంధించి ఇప్పటివరకూ ఉన్న నిబంధనల మేరకు వారంతా తప్పనిసరిగా బయోమెట్రిక్ డేటాను పొందుపరచాల్సి ఉంటుంది.

ఇక ఐదేళ్ల ప్రాయం లోపలి పిల్లలకు సంబంధించి వారి ఫోటోలు అవసరం అయితే తల్లిదండ్రుల లేదా సంరక్షకుల బయోమెట్రిక్ అధీకృత ప్రక్రియలో వీరికి వారి బాంధవ్యాన్ని అంటే బర్త్‌సర్టిఫికెట్ల ప్రాతిపదికన బాల్ ఆధార్ కార్డుల జారీకి అర్హత కల్పిస్తారు. ఇవి నీలం రంగులో ఉంటాయి. పిల్లలకు 5 ఏండ్లు వచ్చేవరకూ ఇవి వర్తిస్తాయి. తరువాత వారు ఆధార్ సేవాకేంద్రాలకు వెళ్లి తప్పనిసరి బయోమెట్రిక్ అప్‌డేట్‌కు దిగాల్సి ఉంటుంది.