కాంగ్రెస్ పార్టీ కి వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. కీలక నేతలంతా కూడా పార్టీ కి రాజీనామా చేసి, మరో పార్టీ లో చేరుతున్నారు. ఇప్పటికే పలువురు పార్టీ కి గుడ్ బై చెప్పి వెళ్లిపోగా తాజాగా కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి జైవీర్ షేర్ గిల్ పార్టీకి రాజీనామా చేసి షాక్ ఇచ్చారు.
రాజీనామా చేయడమే కాదు పార్టీ ఫై తీవ్ర విమర్శలు చేసారు. రాజీనామా లేఖను అధిష్టానికి పంపారు. ఈ లేఖలో..ముగ్గురు గాంధీలు (సోనియా, రాహుల్, ప్రియాంక) గత ఏడాది కాలంగా తనకు అపాయింట్ మెంట్ నిరాకరిస్తున్నారని జైవీర్ షేర్ గిల్ ఆరోపించారు.
కాంగ్రెస్ అధినాయకత్వం ఆలోచనలకు, ఆధునిక భారతదేశంలోని క్షేత్రస్థాయిలో పరిస్థితులకు ఏమాత్రం సమన్వయం కుదరడంలేదని ఆ లేఖలో స్పష్టం చేశారు. “నా మనోభావాలను పంచుకునేందుకు సమయం ఇవ్వండంటూ ఏడాదిగా అడుగుతున్నా, నన్ను ఒక్కరు కూడా పార్టీ ఆఫీసుకు రమ్మని ఆహ్వానించలేదు” అని షేర్ గిల్ వాపోయారు.
గత ఎనిమిదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ నుంచి తాను పొందిందేమీలేదని, తానే పార్టీకి సేవ చేశానని స్పష్టం చేశారు. “ఇవాళ పార్టీ అగ్రనాయకత్వానికి సన్నిహితంగా మెలిగే వారి ముందు అణిగిమణిగి పడి ఉండాలంటున్నారు. నాకు అది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు” అని తన లేఖలో తేల్చిచెప్పారు.
అందుకే పార్టీతో అన్ని సంబంధాలు తెంచుకుంటున్నాను అని జైవీర్ షేర్ గిల్ తన లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో భజనపరులదే రాజ్యమని, భజన సంస్కృతి కాంగ్రెస్ పార్టీని చెదపురుగుల్లా తినేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

More Stories
బంగ్లాదేశ్ హైకమిషనర్‌కు భారత్ సమన్లు
వ్యక్తిత్వ నిర్మాణంతోనే దేశ నిర్మాణం
శబరిమలలో సిపిఎం జోక్యంతోనే స్థానిక ఎన్నికల్లో ఎదురుదెబ్బ!