 
                స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయినా ఆశించిన మేరకు పోలీస్ సంస్కరణలు జరగకపోవడం పట్ల విచారం వ్యక్తం చేస్తూ  ఈ విషయంలో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలకు రాజకీయ సంకల్పం అవసరమని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు చెప్పారు. 
రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులపై కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఆయన సూచించారు. 
మాజీ పోలీసు అధికారి ప్రకాశ్ సింగ్ రచించిన ‘ద స్ట్రగుల్ ఫర్ పోలీస్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా’ పుస్తకాన్ని ఆదివారం ఢిల్లీలో ఆయన ఆవిష్కరించారు.  సాధ్యమైనంత త్వరగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి విస్తృతమైన సంస్కరణలు తీసుకురావాలని వెంకయ్య పిలుపిచ్చారు.
ఆధునిక భారతదేశంలో ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలకు అనుగుణంగా పోలీసు వ్యవస్థలో సంస్కరణలు జరగాలని స్పష్టం చేశారు.
1857 తర్వాత బ్రిటిష్ పాలకులు తమ సామ్రాజ్య ప్రయోజనాలను నిలబెట్టుకోవడమే ప్రధాన అజెండాగా పోలీసు బలగాలకు రూపకల్పన చేశారని ఉపరాష్ట్రపతి గుర్తు చేశారు. అయితే,  స్వరాజ్య సముపార్జన తర్వాత కూడా ఈ విషయంలో ఆశించిన మేర సంస్కరణలు రాకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు.  వీలైనంత త్వరగా పోలీసింగ్ లో విస్తృతమైన సంస్కరణలు తీసుకురావాలని సూచించారు.
 21 శతాబ్దపు సైబర్ క్రైమ్ వంటి నేరాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు, ఈ తరం సవాళ్ళకు అనుగుణంగా పోలీసుల నైపుణ్యాలను మెరుగు పరచాల్సిన అవసరాన్నిఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.  పోలీసుల వైఖరిలో స్పష్టమైన మార్పు రావలసిన అవసరం ఉందన్న ఆయన, ప్రతి ఒక్కరి సమస్యను విని అర్ధం చేసుకునే ఓపికను పోలీసులు కలిగి ఉండాలని పేర్కొన్నారు.
ఎమర్జెన్సీ సమయంలో పోలీసులు తమ అధికారాన్ని ఎంతో దుర్వినియోగం చేశారంటూ, అప్పట్లో తాను జైలు జీవితం గడిపిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. పోలీసు వ్యవస్థలో ఖాళీల భర్తీ, మౌలిక సదుపాయాల కల్పన, పోలీసులకు నివాస సముదాయల వంటి సౌకర్యాలతో సహా ప్రతి అంశంలోనూ మార్పులు జరగాలని సూచించారు. 
సామాన్య ప్రజల పట్ల పోలీసులు స్నేహపూర్వకంగా, మర్యాదగా వ్యవహరించాలని, పోలీసుల వైఖరిలోనే స్పష్టమైన మార్పు రావాలని చెప్పారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో నేరస్తులు, ఉగ్రవాదులు, తీవ్రవాదులు, అరాచక శక్తులతో పోరాడుతూ విధి నిర్వహణలో తమ ప్రాణాలను అర్పించిన పోలీసుల స్మృతికి ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి నివాళులు అర్పించారు.
 నూతన శతాబ్దపు సవాళ్ళను అధిగమించడంలో స్మార్ట్ ఫోర్స్ సంస్కరణలు ఎంతగానో తోడ్పడతాయంటూ ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ కృషిని వెంకయ్య నాయుడు ప్రత్యేకంగా అభినందించారు. పోలీసు సంస్కరణలను సమర్ధించిన పుస్తక రచయిత ప్రకాష్ సింగ్ తన ఒంటరి ప్రయత్నాలతో ఇంత సాధించారని కొనియాడారు. 
                            
                        
	                    




More Stories
బీహార్ ఎన్నికల ఎన్డీయే మేనిఫెస్టోలో కోటి ప్రభుత్వ ఉద్యోగాలు
సుప్రీంకోర్టు 53వ సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్
ముంబైలో పిల్లలను బందీలుగా తీసుకున్న ఆర్య కాల్చివేత