మత ప్రదేశాల్లో లౌడ్స్పీకర్లకు అనుమతి తప్పనిసరి

మత ప్రదేశాల్లో లౌడ్స్పీకర్లకు అనుమతి తప్పనిసరి
మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ థాకరే లేవనెత్తిన లౌడ్‌స్పీకర్ల అంశానికి ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం ఎట్టకేలకు తలొగ్గింది. మసీదులు గుడులు సహా ఇతర మతపరమైన ప్రదేశాల్లో ప్రభుత్వ అనుమతి ఉంటేనే లౌడ్‌స్పీకర్లు పెట్టుకోవాలని మహారాష్ట్ర హోంమంత్రి దిలిప్ వాస్లే పాటిల్ సోమవారం స్పష్టం చేశారు. 
 
ఈ విషయమై ఆయన ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేతో ప్రత్యేక సమావేశమయ్యారు. అనంతరం రాష్ట్ర డీజీపీతో సమావేశమై రాష్ట్ర పోలీసు యంత్రానికి తగిన సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. దానితో 
మహారాష్ట్రలో మతపరమైన ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్ల వాడకంపై సూచనలు హోంశాఖ జారీ చేసింది.  ప్రభుత్వ అనుమతితోనే మే 3 వరకు లౌడ్ స్పీకర్లు వాడాలని తెలిపింది.
మసీదులపై ఉంచిన లౌడ్ స్పీకర్లను తొలగించాలని మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్ రాజ్ థాక్రే అల్టిమేటం ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. రాష్ట్ర హోంమంత్రి దిలీప్ వాల్సే పాటిల్ డీజీపీతో సమావేశం నిర్వహించారు.
రాష్ట్రంలోని పోలీసు కమిషనర్లు, అధికారులకు లౌడ్ స్పీకర్ల వాడకాలపై కొత్త ఆదేశాలు జారీ చేయాలని వివరించారు. భజనలు, ప్రార్థనల కోసం ముందస్తుగా అనుమతి తీసుకోవాలని నాసిక్ సీపీ దీపక్ పాండే చెప్పారు. అజాన్ కు ముందు, తర్వాత 15 నిమిషాల లోపు భజనలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.
 
 కాగా, మసీదుకు వంద మీటర్లలోపు భజనలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. శాంతి భద్రతలను కాపాడటమే ముఖ్యమని నాసిక్ సీపీ పేర్కొన్నారు. ఆర్డర్ ను ఉల్లంఘిస్తే.. చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
 
వివాదాస్పదంగా మారిన లౌడ్ స్పీకర్ల అంశంపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్ రాజ్ థాక్రే ఆదివారం మాట్లాడుతూ  మసీదుల్లో పెట్టిన లౌడ్ స్పీకర్లను తొలగించాలని డిమాండ్ చేశారు.  ప్రార్థనలు చేసుకోవడానికి తాము వ్యతిరేకం కాదని, అయితే మసీదులపై ఉంచిన లౌడ్ స్పీకర్లను మాత్రం తీసేయాలని పేర్కొన్నారు. 
వచ్చే నెల 3వ తేదీ లోపు మసీదుల్లో లౌడ్‌స్పీకర్లు తొలగించకపోతే, మసీదుల బయట తాము బిగ్గరగా వినిపించే హనుమాన్‌ చాలీసాను ముస్లింలు వినాల్సి వస్తుందని ఈ సందర్భంగా  రాజ్ థాకరే హెచ్చరించారు. ఇందుకు హిందూ సోదరులందరూ సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. అయితే లౌడ్‌స్పీకర్ల ద్వారా అజాన్‌కు పిలుపు ఇవ్వడం మతపరమైన అంశం కాదని, అది సామాజిక సమస్య అని రాజ్ థాకరే పేర్కొన్నారు.
‘‘న్యాయవ్యవస్థకన్నా తమ మతమే గొప్పదని ముస్లింలు భావిస్తే, దెబ్బకుదెబ్బ తీస్తాం. అయితే ముస్లింలకు, వారి ప్రార్థనలకు మేం వ్యతిరేకం కాదు. శాంతికి భంగం కలగాలని మేమెప్పుడూ కోరుకోం కూడా’’ అని రాజ్‌ఠాక్రే తెలిపారు. హిందూ ఊరేగింపులపై దాడులు కొనసాగితే తాము కూడా ఆయుధాలు పట్టుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కాగా శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ వ్యాఖ్యలకు తాను స్పందించనని దాటవేయడం గమనార్హం.