
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రచార సమయం పెంచడంతోపాటు రోడ్‌షోలు, పాదయాత్రలు, ఊరేగింపులపై నిషేధాన్ని ఎన్నికల కమిషన్ ఎత్తివేసింది. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు ఉన్న ఎన్నికల ప్రచార సమయాన్ని ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్వహించుకునేందుకు అనుమతించింది. దీంతో, ప్రచారం నిర్వహించుకునేందుకు మరో నాలుగు గంటల అదనపు సమయం పార్టీలకు లభించింది.
కరోనా కేసులు భారీగా తగ్గిన నేపథ్యంలో ఈ సడలింపులిచ్చింది. గోవా, ఉత్తరాఖండ్ తొలి దశ, ఉత్తర ప్రదేశ్‌లో రెండో దశ ఎన్నికల ప్రచారం ముగింపు సమయంలో ప్రచార మార్గదర్శకాలలో మార్పులను ఇసి చేసింది. రోడ్ షోలు, పాదయాత్రలు, ఊరేగింపులపై నిషేధాన్ని ఎత్తివేసింది.
”పరిమితుల ప్రకారం అనుమతించబడిన వ్యక్తుల సంఖ్య కంటే ఎక్కువ కాకుండా జిల్లా అధికారుల ముందస్తు అనుమతితో మాత్రమే పాదయాత్ర అనుమతించబడుతుంది” అని కమిషన్ తెలిపింది. ఇప్పటి వరకు, ఇండోర్/అవుట్డోర్ సమావేశాలు/ర్యాలీలు ఇండోర్ హాళ్ల సామర్థ్యంలో గరిష్టంగా 50 శాతం, ఓపెన్ గ్రౌండ్ సామర్థ్యంలో 30శాతం వరకు లేదా రాష్ట్ర అధికారుల ఆదేశాల మేరకు అనుమతించారు.
తాజా ఉత్తర్వుల్లో అవుట్డోర్ సమావేశాల సామర్థ్యం 50 శాతంకు పెరిగింది. ఉత్తరప్రదేశ్‌లో జరిగే తదుపరి ఐదు దశల ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, సిఎం యోగి ఆదిత్యనాథ్ సహా పలువురు ప్రముఖులు పోటీ చేసే అనేక కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. లక్నో, అలహాబాద్, రారు బరేలీ, అమేథీ కూడా ఈ ఐదు దశల్లో ఉన్నాయి.
More Stories
ఢిల్లీలో మాత్రమే బాణాసంచాపై నిషేధం విధించాలా?
ఢిల్లీ, ముంబై హైకోర్టులకు బాంబు బెదిరింపులు
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు