
అరుణాచల్ ప్రదేశ్లోని కమెంగ్ సెక్టార్లో గస్తీ విధులు నిర్వహిస్తూ ఆచూకీ తెలియకుండా పోయిన ఏడుగురు వీర సైనికులను మంచు తుఫాను మింగేసింది. వారి కోసం అన్వేషించేందుకు వెళ్లిన ప్రత్యేక సహాయ బృందాలకు వారి విగతజీవులై కనిపించినట్టు, వారి మృతదేహాలను కనుగొన్నట్టు ఆర్మీ ఉన్నతాధికారులు మంగళవారం తెలిపారు.
సమీపంలోని ఆర్మీ ఫెసిలిటీకి వారిని తరలిస్తున్నట్టు చెప్పారు. ఈ జవాన్లంతా ఈనెల 6న మంచు తుఫాను దాటికి గల్లంతయ్యారు. వెంటనే ప్రత్యేక సహాయక బృందాలను రంగంలోకి దింపి విస్తృతంగా గాలించారు.
కాగా, ప్రస్తుతం గాలింపు చర్యలు ముగిసాయని, మంచు ఉత్పాతం సంభవించిన ప్రాంతంలో ఏడుగురు జవాన్ల మృతహాలను స్వాధీనం చేసుకున్నామని ఆర్మీ తెలిపింది. సహాయక బృందంలోని ప్రతి ఒక్కరూ శక్తివంచన లేకుండా కష్టపడినప్పటికీ వీర జవాన్లను కోల్పోవడం దురదృష్టకరమని పేర్కొంది.
గస్తీ బృందాలు మంచు ఉత్పాతంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోవడం ఇది ప్రథమం కాదు. గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. చివరిగా 2020 మేలో ఇలాంటి ఘటనే సిక్కింలో జరిగింది. మంచు తొలగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఇద్దరు ఆర్మీ సిబ్బందిని మంచు తుఫాను పొట్టనపెట్టుకుంది.
2020 ఫిబ్రవరిలో పార్లమెంటుకు ప్రభుత్వం సమర్పించిన లెక్కల ప్రకారం 2019లో సియాచిన్ గ్లాసియర్లో ఆరుగురు ఆర్మీ సిబ్బంది ప్రాణాలు కోల్పోగా, దేశంలోని ఇతర ప్రాంతాల్లో మరో 11 మంది అశువులు బాసారు.
More Stories
జమ్ముకశ్మీర్లో చైనా గ్రెనేడ్లు స్వాధీనం .. ఉగ్ర కుట్ర భగ్నం
అస్సాం రైఫిల్స్ వాహనంపై కాల్పులు.. ఇద్దరు జవాన్లు మృతి
వాతావరణ మార్పుల ప్రభావం.. ఇక ఏటా కుండపోత వర్షాలే!