ఎమ్యెల్యేల సస్పెన్షన్ రద్దుపై బిజెపి హర్షం 

ఎమ్యెల్యేల సస్పెన్షన్ రద్దుపై బిజెపి హర్షం 
మహారాష్ట్ర శాసనసభలో గత ఏడాది జూన్ లో 12 మంది శాసన సభ్యులను ఏడాది పాటు సభ నుండి బహిష్కరిస్తూ  మహావికాస్‌ ఆఘాడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చట్టబద్ధంగా లేదని సుప్రీంకోర్టు పేర్కొనడం పట్ల బిజెపి హర్షం వ్యక్తం చేస్తున్నది.  
 
ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన ఈ నిర్ణయాన్ని తిరస్కరించాలని కోర్టు ఇచ్చిన తీర్పు సత్య విజయం అని బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా కొనియాడారు.  మహారాష్ట్ర మహా వికాస్ అఘాడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ తన గళాన్ని పెంచుతూనే ఉంటుందని ఆయన  స్పష్టం చేశారు. 
 
మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్‌ ఈ తీర్పును స్వాగతిస్తూ ఇది ప్రజాస్వామ్యాన్ని బతికించే ఒక చారిత్రాత్మక నిర్ణయమని ఆయన ట్వీట్‌ చేశారు. అంతేగాకుండా పక్షపాతం లేకుండా తీర్పునిచ్చినందుకు సుప్రీంకోర్టుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే సస్పెన్షన్‌ రద్దయినందుకు 12 బీజేపీ ఎమ్మెల్యేలకు అభినందనలు తెలిపారు. 
 
2021లో జరిగిన వర్షాకాల అసెంబ్లీ సమావేశంలో ఓబీసీ రిజర్వేషన్‌పై చర్చ జరుగుతుండగా బీజేపీ ఎమ్మెల్యేలు రిజర్వేషన్‌కు అనుకూలంగా గళం విప్పారు. ఓబీసీ రిజర్వేషన్‌ కల్పించాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో అధికార, ప్రతిపక్షం మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. 
 
అదే సమయంలో అధికార మహావికాస్‌ ఆఘాడికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు సభలో విపక్ష సభ్యులపై తీవ్రంగా స్పందించారు. ఆ సమయంలో స్పీకర్‌ సీటులో కూర్చున్న భాస్కర్‌ జాదవ్‌ను బీజేపీ ఎమ్మెల్యేలు దూషించారని, ఆయనపై దాడిచేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. 
 
దీంతో బీజేపీ ఎమ్మెల్యేలపై సంవత్సరకాలం పాటు సస్పెండ్‌ వేటు పడింది. అప్పటినుంచి ఈ ఎమ్మెల్యేలు అసెంబ్లీ భవనం మెట్లు ఎక్కలేదు. బీజేపీ శాసనసభ్యులు స్పీకర్‌ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
 
అయితే ఈ నిర్ణయం చట్టబద్ధంగా లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఒక ఎమ్మెల్యేను 60 రోజులకంటే ఎక్కువ సస్పెండ్‌ చేయడమంటే, ఒక విధంగా ఎమ్మెల్యే పదవి రద్దు చేయడంతో సమానమని కోర్టు పేర్కొంది. 
 
ఎలాంటి నియోజకవర్గమైనా ఆరు నెలలకంటే ఎక్కువ కాలం ప్రజాప్రతినిధి లేకుండా ఉండరాదు. దీంతో సంవత్సర కాలంపాటు సస్పెండ్‌ వేటు వేయడం తప్పని పేర్కొంటూ 12 మంది ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ వేటు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో అధికార బలంతో విపక్షాలను అణచివేయాలని ప్రయత్నించిన ప్రభుత్వానికి ఈ తీర్పు చెంపపెట్టని బిజెపి ధ్వజమెత్తింది.