
కరోనా మహమ్మారి ఒమిక్రాన్ రూపంలో మళ్లీ తన ప్రభావం చూపే ప్రమాదం ఉన్నదని, అయితే ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భారత ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ప్రభుత్వాలు, వైద్య నిపుణులు సూచిస్తున్న జాగ్రత్తలను ప్రజలంతా పాటిస్తే సరిపోతుందని ఆయన సూచించారు.
ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవడంలో చొరవ తీసుకోవడంతోపాటు ఇతరులను కూడా ప్రోత్సహించాలని ఆయన చెప్పారు. రాజకీయ విశ్లేషకుడు గౌతమ్ చింతామణి రచించిన ‘ద మిడ్ వే బాటిల్: మోడీస్ రోలర్ కోస్టర్ సెకండ్ టర్మ్’ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి నివాసంలో జరిగిన ఒక కార్యక్రమంలో వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు.
నడుస్తున్న చరిత్రను పుస్తకరూపంలో తీసుకురావడం అంత సులువైన విషయం కాదని అంటూ ఈ ప్రయత్నం చేసిన గౌతమ్ చింతామణిని ఆయన అభినందించారు.
‘జీవన ప్రమాణాలు మెరుగుపడటం, ఆర్థిక సమగ్రత, ఆరోగ్య సంరక్షణ అందుబాటులోకి రావడం, ఉపాధికల్పన, సొంతింటి కల, పారిశ్రామిక వర్గాలకు చేయూత కల్పించడంతోపాటు వివిధ అంశాల్లో పురోగతి స్పష్టంగా కనిపిస్తున్నది’ అని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ప్రపంచ స్టార్టప్ వ్యవస్థకు మన దేశం కేంద్రంగా మారనున్నదని పేర్కొన్నారు.
మరోసారి విశ్వగురు అయ్యే దిశగా భారతదేశం అభివృద్ధి పథంలో పయనిస్తున్నదని చెప్పాన్నా. ప్రతి భారతీయుడు బాధ్యతగా నడుచుకోవడమే అసలైన దేశభక్తి అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయుడు, సమాచార, ప్రసార శాఖ సలహాదారు కంచన్ గుప్తా, బ్లూమ్స్‌బరీ ఇండియా సంపాదకురాలు శ్రీమతి ప్రేరణా బోరా పాల్గొన్నారు.
More Stories
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు
జర్మనీ వైపు చూస్తున్న భారతీయ విద్యార్థులు