భారత భద్రతా దళాలపై ఐరాస విమర్శలు నిరాధారం

భారత దేశ భద్రతా దళాలపై ఐక్య రాజ్య సమితి మానవ హక్కుల కార్యాలయం చేస్తున్న విమర్శలు నిరాధారమైనవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. హక్కుల కార్యకర్త ఖుర్రం పర్వేజ్ అరెస్టు, కశ్మీరులో సాధారణ పౌరుల హత్యలపై ఐరాస మానవ హక్కుల హై కమిషనర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో భారత ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. 

ఐక్య రాజ్య సమితి మానవ హక్కుల హై కమిషనర్ కార్యాలయం బుధవారం ఓ ప్రకటనలో, హక్కుల కార్యకర్త పర్వేజ్‌ను చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) క్రింద అరెస్టు చేయడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కశ్మీరులో ఆర్మ్‌డ్ గ్రూపులు ఈ సంవత్సరం మతపరమైన మైనారిటీలను, సాధారణ పౌరులను హత్య చేయడం పెరిగిందని, ఇది చాలా ఆందోళనకరమని పేర్కొంది. 

ఈ నేపథ్యంలో భారత దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి స్పందిస్తూ, ఐరాస సంస్థ భారత దేశ భద్రతా దళాలపై చేసిన వ్యాఖ్యలు సరికాదని స్పష్టం చేశారు. ఈ ఆరోపణలకు ఎటువంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు. 

సరిహద్దుల ఆవలి నుంచి భారత దేశం ఎదుర్కొంటున్న భద్రతాపరమైన సవాళ్ళపట్ల ఐరాస సంస్థకు అవగాహన లేదని స్పష్టమవుతోందని విమర్శించారు. సరిహద్దుల ఆవలి నుంచి వస్తున్న ఉగ్రవాదం వల్ల భారత దేశంలోని జమ్మూ-కశ్మీరు సహా అత్యంత ప్రాథమిక మానవ హక్కు అయిన జీవించే హక్కు ప్రభావితమవుతోందని ఆయన తెలిపారు. 

ఐక్యరాజ్య సమితి ప్రకటించిన ఉగ్రవాద సంస్థలను ‘సాయుధ గ్రూపులు’గా పేర్కొనడంలోనే మానవ హక్కుల హై కమిషనర్ పక్షపాతం స్పష్టంగా కనిపిస్తోందని ఆయన విమర్శించారు. భారత్ ఓ ప్రజాస్వామిక దేశంగా తన ప్రజల మానవ హక్కులను ప్రోత్సహించడానికి, పరిరక్షించడానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. 

సరిహద్దుల ఆవలి నుంచి వచ్చే ఉగ్రవాదాన్ని ఎదుర్కొనడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. భారత దేశ సార్వభౌమాధికారాన్ని పరిరక్షించేందుకు, దేశ ప్రజలకు భద్రత కల్పించేందుకు పార్లమెంటు యూఏపీఏ వంటి జాతీయ భద్రతా చట్టాలను చేసిందని తెలిపారు. పర్వేజ్ అరెస్టు చట్ట ప్రకారమే జరిగిందని స్పష్టం చేశారు. 

చట్ట ఉల్లంఘనలకు వ్యతిరేకంగా మాత్రమే భారత దేశ వ్యవస్థలు, అధికారులు చర్యలు తీసుకుంటారని, చట్టబద్ధంగా హక్కులను వినియోగించుకోవడానికి వ్యతిరేకంగా ఎటువంటి చర్యలు తీసుకోబోరని ఆయన భరోసా ఇచ్చారు. అన్ని చర్యలు కచ్చితంగా చట్టానికి అనుగుణంగానే ఉంటాయని తేల్చి చెప్పారు. మానవ హక్కులపై ఉగ్రవాదం చూపే ప్రతికూల, నకారాత్మక (నెగెటివ్) ప్రభావాన్ని మరింత మెరుగ్గా అర్థం చేసుకోవాలని మానవ హక్కుల హై కమిషనర్‌ను ఈ సందర్భంగా భారత్ కోరింది.