ఉమ్మడి పౌర స్మృతి చాలా అవసరం… ఢిల్లీ హైకోర్టు

భారత దేశంలో ఉమ్మడి పౌర స్మృతి అవసరం చాలా ఉందని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. దీనిని అమలు చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఆధునిక భారత దేశం క్రమంగా సజాతీయం, ఏకజాతిగా మారుతోందని, సంప్రదాయ కుల, వర్గ, మతపరమైన అంతరాలు అంతరించిపోతున్నాయని పేర్కొంది. 

ఈ మారుతున్న పరిణామాల నేపథ్యంలో ఉమ్మడి పౌర స్మృతి అవసరమని తెలిపింది. మీన కమ్యూనిటీకి చెందిన వ్యక్తులకు హిందూ వివాహ చట్టం, 1955 వర్తించడానికి సంబంధించిన కేసులో జూలై 7న ఇచ్చిన తీర్పులో జస్టిస్ ప్రతిభ ఎం సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత చట్టాల వల్ల ఉత్పన్నమవుతున్న వైరుద్ధ్యాలు న్యాయస్థానానికి పదే పదే వస్తున్నాయని జస్టిస్ ప్రతిభ పేర్కొన్నారు.

ఇటువంటి వైరుద్ధ్యాల వల్ల వివాహ బంధంలో ప్రవేశించిన వివిధ కమ్యూనిటీలు, కులాలు, మతాలకు చెందినవారు సంఘర్షణకు గురవుతున్నట్లు తెలిపారు. వేర్వేరు కమ్యూనిటీలు, తెగలు, కులాలు లేదా మతాలకు చెందిన భారతీయ యువత తమ పెళ్లిళ్ల విషయంలో వివిధ వ్యక్తిగత చట్టాల్లోని వైరుద్ధ్యాల వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలతో పోరాడవలసిన తప్పనిసరి పరిస్థితిని కల్పించకూడదని స్పష్టం చేశారు.

మరీ ముఖ్యంగా పెళ్లి, విడాకుల విషయంలో యువత పోరాడవలసిన పరిస్థితు ఉండకూడదని చెప్పారు. భారత రాజ్యాంగంలోని అదికరణ 44 ఆశించినట్లుగా ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫాం సివిల్ కోడ్) అవసరాన్ని సుప్రీంకోర్టు ఎప్పటికప్పుడు చెప్తోందని ఆమె గుర్తు చేశారు. ఇటువంటి పౌర స్మృతి అందరికీ సార్వజనీనంగా వర్తిస్తుందన్నారు. పెళ్లి, విడాకులు, వారసత్వం వంటి విషయాల్లో ఏకరీతి సిద్ధాంతాల వర్తింపునకు దోహదపడుతుందని తెలిపారు. వివిధ వ్యక్తిగత చట్టాల వల్ల ఉత్పన్నమయ్యే వైరుద్ధ్యాలు, అసంగతాలను ఉమ్మడి పౌర స్మృతి తగ్గిస్తుందని వివరించారు.

గత ఏడాది మార్చిలో సుప్రీంకోర్టు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఓ వివరణ కోరింది. మతంతో సంబంధం లేకుండా వారసత్వ చట్టాల రూపకల్పనపై అభిప్రాయం చెప్పాలని కోరింది. దీనికి సంబంధించిన ఐదు పిటిషన్లను విచారణకు చేపట్టింది. దీంతో దేశంలో ఉమ్మడి పౌర స్మృతికి బాటలు పడుతున్నాయనే అభిప్రాయం ఏర్పడింది. 

పెళ్లి, విడాకులు, దత్తత, వారసత్వం వంటి విషయాలకు వర్తించే చట్టాలు ప్రస్తుతం మన దేశంలో వేర్వేరు మతాలకు వేర్వేరుగా ఉన్నాయి. హిందూ వివాహ చట్టం, హిందూ వారసత్వ చట్టం, ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజెస్ యాక్ట్, ఇండియన్ డైవోర్స్ యాక్ట్, పార్శీ మ్యారేజ్ అండ్ డైవోర్స్ యాక్ట్ వంటివి అమల్లో ఉన్నాయి.

అయితే ముస్లిం పర్సనల్ చట్టాన్ని క్రోడీకరించలేదు. ముస్లింల మతపరమైన గ్రంథాలే వీటికి ఆధారం. ఈ వ్యక్తిగత చట్టాల వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలను పరిష్కరిస్తూ, అన్ని మతాల వారికీ ఒకే విధమైన నిబంధనలు వర్తించేలా చేయడానికి ఉమ్మడి పౌర స్మృతి అవసరమని చాలా మంది చెప్తున్నారు.