దేశంలోనే మొదటి నషా ముక్త్ రాష్ట్రంగా తెలంగాణ అవతరించాలి

“2029 నాటికి దేశాన్ని మాదకద్రవ్యాల రహితంగా మార్చాలన్న ప్రధాని మోదీ సంకల్పంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. మావోయిస్టులను నిర్మూలించినట్లే నషా నుంచి తెలంగాణకు విముక్తి కల్పించాలి” అని నషా ముక్త్ భారత్ మెగా సైకిల్ ర్యాలీల ప్రారంభ కార్యక్రమంలో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పిలుపిచ్చారు. 
 
దేశంలోనే మొట్టమొదటి నషా ముక్త్ రాష్ట్రంగా తెలంగాణ అవతరించాలని చెబుతూ తెలంగాణను నషా ముక్త్ రాష్ట్రంగా తీర్చిదిద్దితే దేశాన్ని నషా ముక్త్‌గా మార్చే జాతీయ సంకల్పానికి బలమైన పునాది ఏర్పడుతుందని తెలిపారు. ఈ ఉద్యమంలో రాష్ట్ర ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. హైదరాబాద్‌లోని హెచ్ఎండిఎ గ్రౌండ్స్ లో రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ నిర్వహించిన నషా ముక్త్ భారత్ మెగా సైకిల్ ర్యాలీనీ గవర్నర్ ప్రారంభించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2029 నాటికి దేశాన్ని మాదకద్రవ్యాల రహితంగా మార్చాలన్న దృఢ సంకల్పాన్ని ప్రకటించారని, ఈ లక్ష్య సాధనకు కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా నాయకత్వంలో ‘విజన్ డాక్యుమెంట్ ఆన్ డ్రగ్ కంట్రోల్ 2026–2029’ రూపొందించారని గవర్నర్ తెలిపారు. ప్రధాని పిలుపును ప్రజా ఉద్యమంగా మార్చడంలో ఇటువంటి సైకిల్ ర్యాలీలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.
డాక్టర్ కె. లక్ష్మణ్ గత నాలుగు నెలలుగా ప్రతి ఆదివారం సైకిల్ యాత్రల ద్వారా నషా ముక్త్ భారత్ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తుండటం అభినందనీయమని గవర్నర్ ప్రశంసించారు.  ఇది కేవలం సైకిల్ యాత్ర మాత్రమే కాదని, సమాజం పట్ల బాధ్యత, యువత భవిష్యత్తుపై నిబద్ధత, దేశ నిర్మాణం పట్ల అంకితభావానికి ప్రతీక అని పేర్కొన్నారు.
మాదకద్రవ్యాల వినియోగం ఒక వ్యక్తి జీవితానికే పరిమితం కాకుండా కుటుంబాన్ని, సమాజాన్ని, దేశాన్ని బలహీనపరుస్తుందని గవర్నర్ తెలిపారు. యువత మాదకద్రవ్యాల బారిన పడితే వారి ప్రతిభ, విద్య, ఆరోగ్యం, భవిష్యత్తు దెబ్బతింటాయని గవర్నర్ హెచ్చరించారు. మాదకద్రవ్యాల వల్ల కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులు, గృహహింస, నేరాలు పెరగడంతో పాటు సామాజిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పారు.  
ఆరోగ్యకరమైన, శక్తివంతమైన యువతే బలమైన మరియు అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణానికి అసలైన పునాది అని డా. లక్ష్మణ్ తెలిపారు. మాదకద్రవ్యాల వినియోగం కేవలం వ్యక్తగత సమస్య మాత్రమే కాదని, అది కుటుంబాల ప్రశాంతతను చిన్నాభిన్నం చేసి, దేశ భద్రతకు, అభివృద్ధికి పెను సవాలుగా మారుతోందని హెచ్చరించారు. క్రీడలు, సైక్లింగ్ వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను ఎంచుకుని, 2029 నాటికి డ్రగ్స్ రహిత భారతదేశ నిర్మాణంలో ప్రతి విద్యార్థి, యువకుడు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

About The Author