నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌నకు బిఆర్ఎస్ మ‌ద్ద‌తు

నియోజకవర్గాల పునర్విభజనపై తమ పార్టీ వైఖరి ఎప్పుడూ స్ఫష్టంగా ఉందని చెబుతూ  పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాలకు ప్రస్తుతం ఉన్న 24 శాతం ప్రాతినిధ్య వాటాను కాపాడాలని తాము నిరంతరం డిమాండ్ చేస్తున్నట్లు బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలిపారు.  పార్ల‌మెంట‌రీ ప్రాతినిధ్యంలో ద‌క్షిణ భార‌తదేశం ప్రాధాన్యం ఏమాత్రం త‌గ్గ‌న‌ప్పుడు, తెలంగాణ ఎలాంటి అన్యాయం జ‌ర‌గ‌న‌ప్పుడు తాము నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న మ‌ద్ద‌తు తెలుపుతామ‌ని ఇప్ప‌టికే వైఖరి వెల్ల‌డించామ‌ని, ఇప్పుడు కూడా అదే చెబుతున్నామ‌ని ఓ ఎక్స్ పోస్టులో ప్రకటించారు. 

తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణే తమకు ప్రధానమని కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తమ పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు సవరించిన ప్రతిపాదనకు అనుకూలంగా ఓటు వేస్తారని వెల్లడించారు. రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలగకుండా ప్రాతినిధ్య వాటాకు రక్షణ కల్పించడమే తమ ప్రధాన ఉద్దేశమని తెలిపారు.  పార్లమెంటులో దక్షిణాదికి ప్రస్తుతం ఉన్న 24% ప్రాతినిధ్యం నిష్ప‌త్తి ఏమాత్రం త‌గ్గ‌కూడ‌ద‌ని తాము మొద‌టి నుంచి డిమాండ్ చేస్తున్నామని కేటీఆర్‌ చెప్పారు. 

2051 వరకు అంతర్రాష్ట్ర ప్రాతినిధ్య నిష్పత్తిని మార్చకుండా రక్షణ కల్పిస్తూ, సీట్ల సంఖ్య‌ను 50 శాతం పెంచాలన్న కేంద్ర‌ప్ర‌భుత్వ‌ ప్ర‌స్తుత‌ ప్రతిపాదిత చర్య త‌మ ఆందోళ‌న‌కు ప‌రిష్కారం చూపుతుంద‌ని ఆయన భరోసా వ్యక్తం చేశారు. త‌ద్వారా తెలంగాణలో లోక్‌సభ సీట్ల సంఖ్య‌ 17 నుంచి 26కు పెరుగుతుంద‌ని తెలిపారు.

మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించే అంశానికి బీఆర్ఎస్‌ ఎప్పుడూ మద్దతుగానే ఉందని కేటీఆర్‌ తెలిపారు. మహిళా రిజర్వేషన్ల అమలుకు తమ పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అయితే డీలిమిటేషన్‌ ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యానికి రక్షణ కల్పించడంతోపాటు తెలంగాణ ప్రయోజనాలను కాపాడాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

About The Author