పాలన గాలికొదిలి బీజేపీపై అక్కసా?

* సీఎం రేవంత్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆగ్రహం 

అధికారిక ఖర్చుతో అచ్చంపేటలో నిర్వహించిన సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తమ మూడేళ్ల పాలన, హామీల అమలుపై చర్చించాల్సింది పోయి, కేవలం భారతీయ జనతా పార్టీని, బీజేపీ నాయకులను తిట్టడానికే పరిమితమయ్యారని ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో అసలు బీజేపీ ఎక్కడుందని, పల్లీ బఠానీలు అమ్ముకునే వారంత కూడా బీజేపీ నేతలు లేరని సీఎం చేసిన విమర్శల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.

కామారెడ్డి నియోజకవర్గంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా మట్టికరిపించింది బిజెపి అని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. గతంలో రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన మల్కాజిగిరి పార్లమెంట్ స్థానంలో, అలాగే సొంత జిల్లా మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ పార్టీని ఓడించింది బీజేపీ కాదా? అని నిలదీశారు. 

2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలో ఉండి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా, ప్రతిపక్షంలో ఉన్న బీజేపీకి కూడా కాంగ్రెస్‌తో సమానంగా ఎంపీ సీట్లు వచ్చాయని, ఇటీవల జరిగిన మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో బీజేపీ గెలిచిందని గుర్తు చేశారు. గతంలో  హుజూరాబాద్, దుబ్బాక ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌కు డిపాజిట్లు దక్కలేదని, మునుగోడులో మూడో స్థానానికి పరిమితమైందని ఎద్దేవా చేశారు. 

అదృష్టం కొద్దీ అధికారంలోకి వచ్చినంత మాత్రాన అహంకారంతో మాట్లాడవద్దని, గతంలో ఇదే విధంగా మాట్లాడిన కేసీఆర్ గారికి ఏ గతి పట్టిందో తెలుసుకోవాలని సూచించారు. తెలంగాణలో బీజేపీని జాకీ పెట్టి లేపినా లేవదని సీఎం చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, గతంలో రాహుల్ గాంధీని లేపేందుకు ఎన్ని జాకీలు పెట్టినా ఫెయిల్ అయ్యాయని, ఇప్పుడు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా రాహుల్ గాంధీ జీవితంలో ప్రధాని కాలేరని పాయల్ శంకర్ ఎద్దేవా చేశారు. 

కామారెడ్డిలో ఓడిపోయి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి, బీజేపీ ఓటముల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పాతాళానికి పడిపోయిందని, ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పాయల్ శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. అధిష్టానం మెప్పు కోసం బీజేపీపై విమర్శలు చేయడం మాని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 

సగం మంది రైతులకు కూడా రుణమాఫీ జరగలేదని, అన్నం పెట్టే రైతు ఇబ్బందుల్లో ఉంటే ఆదుకునే దిక్కు లేకుండా పోయిందని విమర్శించారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు అడ్రస్ లేకుండా చేసి తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని పాయల్ శంకర్ ధీమా వ్యక్తం చేశారు.

 

 

 

About The Author