పంజాగుట్ట జీవీకే మాల్‌కు బాంబు బెదిరింపు

హైదరాబాద్‌లో పంజాగుట్టలోని జీవీకే మాల్‌కు గురువారం బాంబు బెదిరింపు కాల్‌ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పంజాగుట్ట పోలీసులు మాల్‌లో తనిఖీలు చేపట్టారు. బాంబ్‌ స్క్వాడ్‌, ఇతర భద్రతా బృందాల సాయంతో అనుమానాస్పద ప్రాంతాలను పరిశీలిస్తున్నారు.  అయితే, ఎటువంటి పేలుడు పదార్థాలు లభించలేదు. ఈ కాల్‌ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు చేశారు? అనే కోణంలో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. 

ఇదిలా ఉండగా, హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో 26/11 ముంబయి దాడుల తరహాలో బాంబు పేలుళ్లు జరుపుతామంటూ ఇటీవల లష్కరే తోయిబా పేరుతో పోలీసులకు బెదిరింపు ఈ-మెయిల్‌ వచ్చిన విషయం తెలిసిందే. కాచిగూడ రైల్వే స్టేషన్‌, హోటల్‌ టూరిస్ట్‌ ప్లాజాను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తామని, 300 మందిని హతమారుస్తామని అందులో హెచ్చరించినట్లు సమాచారం. నవంబర్‌ 21న ఈ మెయిల్‌ అందడంతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు.

నార్వే నుంచి మెయిల్ వచ్చినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. తాత్కాలిక డిస్పోజబుల్ ఈ-మెయిల్ ఐడీతో గుర్తుతెలియని వ్యక్తి పంపినట్లు గుర్తించారు. అయితే ఆ బెదిరింపు మెయిల్ బూటకమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. వీపీఎన్‌ నెట్‌వర్క్, ఐపీ అడ్రస్‌పై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సుమోటో కేసు నమోదు చేసి ఐటీ యాక్ట్ 66-డీ, బీఎన్‌ఎస్‌ సెక్షన్లను జోడించారు.

ఈ బెదిరింపు నేపథ్యంలో కాచిగూడ రైల్వే స్టేషన్‌, హోటల్‌ టూరిస్ట్‌ ప్లాజాలో బాంబ్‌ స్క్వాడ్‌, జాగిలాల బృందాలతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, హోటళ్లు, ప్రార్థనా మందిరాలు, ఇతర రద్దీ ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు, గుర్తుతెలియని బ్యాగులు, వస్తువులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని పోలీసులు వెల్లడించారు.

బాంబు బెదిరింపు ఈ-మెయిల్‌ నేపథ్యంలో ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ సూచించారు. ఇలాంటి బెదిరింపులను ఎదుర్కొనేందుకు పోలీసు యంత్రాంగం ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటుందని తెలిపారు. సోషల్‌ మీడియాలో వచ్చే నిరాధారమైన వార్తలు, వదంతులను నమ్మవద్దని, వాటిని ఇతరులకు ఫార్వర్డ్‌ చేసి భయాందోళనలు సృష్టించవద్దని కోరారు. నగరంలో ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా, గుర్తుతెలియని బ్యాగులు లేదా వస్తువులు ఉన్నా వెంటనే డయల్‌ 112కు సమాచారం ఇవ్వాలని సూచించారు.

నగరంలోని హోటళ్లు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, రద్దీ ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను పెంచాలని ఆదేశాలు జారీ చేశారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు, వదిలి వెళ్లిన వస్తువులపై ప్రత్యేకమైన నిఘా ఉంచాలని పోలీసులకు ఉన్నతాధికారులు సూచించారు. అన్ని భద్రతా విభాగాలతో కో-ఆర్డినేట్ చేసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.

About The Author