కార్తీక దీపం వివాదంలో తమను సంప్రదించ లేదంటున్న అర్చకులు

తమిళనాడులోని తిరుప్పరంకుండ్రం కొండపై దీపథూన్ వద్ద సంప్రదాయ దీపం వెలిగించే విషయంలో తమను సంప్రదించలేదని ఉచ్చిపిళ్లైయార్ ఆలయానికి చెందిన నలుగురు అనువంశిక అర్చకులు వెల్లడించారు. అంతేకాదు, తమ అనుమతి లేకుండానే అధికారిక ఆలయ సమాచారంలో తమ పేర్లను చేర్చారని వారు ఆరోపించారు. నవంబరు 24న ఆలయ డిప్యూటీ కమిషనర్, పాలకమండలి ఛైర్మన్, ఇతర ట్రస్టీలకు అర్చకులు రాసిన లేఖను తాజాగా బీజేపీ, కొన్ని హిందూ సంఘాలు విడుదల చేశాయి.
 
తమను సంప్రదించకుండానే మీడియాకు విడుదల చేసిన సమాచారంలో తమ పేర్లను చేర్చడంపై నలుగురు అర్చకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సంప్రదాయ దీపాన్ని తిరుప్పరంకుండ్రం కొండంపై దర్గా సమీపంలోని రాతి స్తంభం వద్ద నవంబరు 24న వెలిగించడానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. అయినప్పటికీ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలను తమిళనాడు ప్రభుత్వం అమలు చేయలేదు. 
 
ఏటా మాదిరిగానే ఉచ్చిపిళ్లైయార్ ఆలయ సమీపంలోని దీప మండపంలోనే కార్తీక దీపాన్ని వెలిగించిన మర్నాడే అర్చకుల (భట్టర్లు) నుంచి ఈ వివరణ రావడం గమనార్హం. కార్తీక దీపాన్ని సాంప్రదాయ స్థానంలోనే వెలిగించాలని తీర్మానం చేసినప్పుడు.. చారిత్రక మత ఆచారాలు, ఆగమశాస్త్ర నియమాలతో పాటు స్థానిక భట్టర్ల (అర్చకులు) అభిప్రాయాలను కూడా పాలకమండలి ప్రస్తావించింది. 
 
అయితే, ఈ తీర్మానంలోని సమాచారం గురించి తమకు మీడియా ద్వారానే తెలిసిందని అర్చకులు పేర్కొన్నారు. ఈ ఏడాది కార్తీక దీపం వెలిగించే విషయంపై ఆలయ పాలనా యంత్రాంగానికి తాము ఎటువంటి లేఖను సమర్పించలేదని వారు తేల్చిచెప్పారు. గతంలో తాము రాసిన లేఖ గురించి మాట్లాడుతూ ఉచ్చిపిళ్లైయార్ ఆలయంలో దీపం వెలిగించే విషయంపై గత ఏడాది పోస్టు ద్వారా ఒక్క లేఖ మాత్రమే పంపామని అర్చకులు తెలిపారు. 
 
ఈ లేఖ వెలుగులోకి రావడంతో భక్తులను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ విమర్శలు గుప్పించింది. ప్రజలను మోసం చేసిన టీవీకే ప్రభుత్వం దురుద్దేశం బయటపడిందని బీజేపీ నేత నారాయణ తిరుపతి విమర్శించారు. మరోవైపు, వివాదాస్పద దీపథూన్‌ వద్ద కార్తీక దీపం వెలిగించడంలో విఫలమైనందుకు సుప్రీంకోర్టుకు తమిళనాడు ప్రభుత్వం క్షమాపణ చెప్పింది. 
 
అయితే, దీపం వెలిగించడానికి అరుళ్‌మిగు సుబ్రమణ్యస్వామి ఆలయ అధికారులు అనుమతించలేదని వారిపై నింద మోపింది. సుప్రీంకోర్టు ముందు దాఖలు చేసిన మధ్యంతర నివేదికలో మదురై జిల్లా కలెక్టర్ నిశాంత్ కృష్ణ.. నవంబరు 20న సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయడానికి దీపథూన్‌ వద్ద దీపం వెలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని తెలిపారు.

అయితే, ఆలయ ధర్మకర్తల మండలి ప్రతిపాదించిన బృందానికి అనుమతి ఇవ్వకపోవడం వల్లే ఆ ఉత్తర్వును అమలు చేయలేకపోయామని, కార్తీక మహాదీపాన్ని సాంప్రదాయ స్థానంలోనే వెలిగించే సంప్రదాయ పద్ధతిని పాటించాలని ఆ మండలి తీర్మానం చేసిందని రాష్ట్ర ప్రభుత్వం తన నివేదికలో పేర్కొంది. మరోవైపు, తమిళనాడు ప్రభుత్వం కార్తీక పౌర్ణమి రోజున తిరుప్పరంకుండ్రం వద్ద వేలాది మంది పోలీసులను మోహరించి, ఆందోళనకారులను అడ్డుకోవడం కూడా తీవ్ర విమర్శలు దారితీసింది.

About The Author