డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించడంలో మహిళా శక్తి కీలక పాత్ర

డ్రగ్స్ మహమ్మారిని దేశం నుంచి పూర్తిగా నిర్మూలించడంలో మహిళా శక్తి, ముఖ్యంగా విద్యార్థినులు, యువతులు కీలక పాత్ర పోషించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి ఇంట్లో, ప్రతి బస్తీలో, ప్రతి కాలనీలో డ్రగ్స్ వ్యతిరేక చైతన్యం తీసుకురావాలని, తల్లిదండ్రులు, మహిళలు సమాజాన్ని వ్యసనాల నుంచి కాపాడేందుకు ముందుకు రావాలని కోరారు.

 ‘హైదరాబాద్ వాక్ ఫర్ నషా ముక్త్ భారత్’ పాదయాత్ర రెండోరోజు  హిమాయత్‌నగర్‌కు చేరుకున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు, తల్లులు, అక్కాచెల్లెళ్లు డ్రగ్స్ వ్యతిరేకంగా గళమెత్తి తమ కుటుంబాల్లో, పరిసరాల్లో వ్యసనాలకు బానిసైన వారిలో మార్పు తీసుకురావడానికి కృషి చేసినప్పుడే ప్రధానమంత్రి మోదీ ఆకాంక్షించిన నషా ముక్త్ భారత్ లక్ష్యం సాధ్యమవుతుందని తెలిపారు. 

 డ్రగ్స్ అనేది వ్యక్తిగత జీవితానికే కాకుండా కుటుంబానికి, సమాజానికి, దేశ భవిష్యత్తుకు, అభివృద్ధికి తీవ్ర నష్టం కలిగించే మహమ్మారి అని హెచ్చరించారు. నవమాసాలు మోసి, ఎంతో ప్రేమతో పెంచి పెద్ద చేసి, విద్యాసంస్థలకు పంపించిన పిల్లలు డ్రగ్స్ బారిన పడితే తల్లిదండ్రులు ఎంతటి వేదనకు గురవుతారో ప్రతి ఒక్కరూ ఆలోచించాలని సూచించారు.

యువత డ్రగ్స్‌కు దూరంగా ఉంటూ క్రీడలు, వ్యాయామం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవాలని సూచించారు. క్రీడల్లో పట్టుదలతో రాణించి దేశానికి పతకాలు తీసుకురావాలని, పుల్లెల గోపీచంద్ వంటి క్రీడా దిగ్గజాలను స్ఫూర్తిగా తీసుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.  2029 నాటికి డ్రగ్స్ రహిత భారతదేశాన్ని నిర్మించాలన్నది ప్రధానమంత్రి సంకల్పమని, దేశంలోకి డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకోవడంతో పాటు వాటి తయారీ, సరఫరా, విక్రయాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.  

 డ్రగ్స్ నిర్మూలన కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి కుటుంబం, ప్రతి తల్లి, ప్రతి అక్కాచెల్లి, ప్రతి పౌరుడు ఈ ఉద్యమంలో భాగస్వామి కావాలని కోరారు.  డ్రగ్స్ తయారు చేసి, ఇతర దేశాల నుంచి భారతదేశంలోకి అక్రమంగా సరఫరా చేసే వారిపై తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, దేశ యువత జీవితాలను నాశనం చేసే డ్రగ్స్ మాఫియాను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.  

కాగా, డ్రగ్స్ రహిత భారతదేశ నిర్మాణం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ‘నషా ముక్త్ భారత్’ కార్యక్రమం ఎంతో గొప్ప చొరవ అని ప్రముఖ సినీ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొనియాడారు.పాదయాత్రలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ యువతే దేశ భవిష్యత్తు అని, వారిని సరైన మార్గంలో నడిపించడం, మంచి లక్ష్యాల వైపు ప్రోత్సహించడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని పిలుపునిచ్చారు.  

 డ్రగ్స్ తయారు చేసేవారు, సరఫరా చేసేవారు, విక్రయించేవారు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వదిలిపెట్టబోమని, వారిని పట్టుకొచ్చి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కిషన్ రెడ్డి హెచ్చరించారు. పాదయాత్ర ఖైరతాబాద్‌కు చేరుకున్న సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఖైరతాబాద్ మహాగణపతి సాక్షిగా డ్రగ్స్ మాఫియాకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఎవరు డ్రగ్స్ తయారు చేసినా, దేశంలోకి సరఫరా చేసినా, యువత జీవితాలను నాశనం చేయాలని ప్రయత్నించినా ఉపేక్షించేది లేదని, అలాంటి వారిని ఎక్కడున్నా పట్టుకొచ్చి తగిన శిక్ష పడేలా చేస్తామని హెచ్చరించారు.

 

About The Author